చైనాలో కిమ్ సడెన్ పర్యటన.. ట్రంప్ తో భేటీ వేళ.. కారణం ఏంటి..?
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనాలో సడెన్ పర్యటన చేపట్టారు. ఇరు దేశాల మధ్య అనుసంధానంగా ఇటీవల ప్రారంభించిన బ్రిడ్జి గుండా ఆయన చైనాలోని సరిహద్దు నగరం అయిన దండోంగ్ లో పర్యటించారు. ఈ విషయాన్ని యోన్ హాప్ న్యూస్ ఏజెన్సీ ధృవీకరించింది. చైనాలో ఇటీవలే నిర్మించి ప్రారంభించిన న్యూ యాలూ రివర్ బ్రిడ్జ్ నుంచి కిమ్.. నార్త్ ఈస్టర్న్ చైనాలోని లియానోయింగ్ ప్రావిన్స్ లో ఉన్న. దండోంగ్ పట్టణంకు చేరుకున్నారు. దాదాపు సంవత్సరం తర్వాత నార్త్ కొరియా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఆసక్తికరంగా మారింది. కిమ్ రాక నేపథ్యంలో దండోంగ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

ఇక చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడైన వాంగ్ హునింగ్ తో కలిసి కిమ్.. చైనాలోని ఓ కార్ల తయారీ పరిశ్రమను సందర్శించారు. అనంతరం కొరియా యుద్ధ స్మారకాన్ని సందర్శించి.. ఆ యుద్ధంలో మరణించిన చైనా సైనికులకు నివాళులు అర్పించారు. అలాగే చైనాకు ఉత్తర కొరియాపై ఉన్న దీర్ఘకాల మద్దతుకు కిమ్ కృతజ్ఞతలు తెలిపినట్లు జిన్హువా స్పష్టం చేసింది. ఇక చైనా పర్యటన ముగిసిన తర్వాత కిమ్ స్వదేశానికి తిరిగి వెళ్లారు. ఈ క్రమంలో వాంగ్ హునింగ్ ఆయనకు వీడ్కోలు పలికారు.
ఇక ఇటీవల ప్రారంభమైన ది న్యూ యాలూ నది బ్రిడ్జి నార్త్ కొరియాలోని సినూయిజూ ప్రాంతంతో చైనాలోని దండోంగ్ ప్రాంతాన్ని కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ అక్టోబర్ 15న అధికారికంగా ప్రారంభం అయింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం 2014 లోనే పూర్తయింది. కానీ దాదాపు పదమూడేళ్ల తర్వాత బ్రిడ్జి ఓపెన్ కావడం గమనార్హం. మరోవైపు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నట్లు సమాచారం. షెంజెన్ లో జరగనున్న ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్ సమ్మిట్ లో భాగంగా వీరి సమావేశం జరగనున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే ఈ పరిణామాల దృష్ట్యా కిమ్.. చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications
