లాస్ ఏంజిలిస్ బూడిద కుప్ప- హాలీవుడ్ అగ్నికి స్వాహా: నిరాశ్రయులైన స్టార్ హీరోలు వీళ్లే..
Los Angeles wildfire: ప్రపంచంలోనే మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ సిటీగా పేరున్న లాస్ ఏంజిలిస్ మంటల బారిన పడింది. దావానలం ఈ నగరాన్ని దహించివేస్తోంది. ఇప్పటివరకు 11 మంది సజీవదహనం అయ్యారు. మంటలు ఇంకా వ్యాప్తి చెందుతోండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మంగళవారం నాడు ఈ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అగ్నికీలలు వ్యాపిస్తూనే ఉన్నాయి. అయిదో రోజూ మంటల్లో తగుబడుతూనే వస్తోంది లాస్ ఏంజిలిస్. హాలీవుడ్ అగ్నికి అహూతి అయింది. పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, టెక్నీషియన్ల నివాసాలు కాలి బూడిద అయ్యాయి.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారీగా ఆస్తినష్టం సంభవించిందిక్కడ. అనేక ప్రాంతాలు బుగ్గిపాలు అయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. లాస్ ఏంజిలిస్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన తరలింపు చర్యలు చేపట్టింది. 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసింది.
లాస్ ఏంజిలిస్ చుట్టూ దట్టమైన అడవులు ఉన్న విషయం తెలిసిందే. ఏంజిలిస్ నేషనల్ ఫారెస్ట్, మౌంటో ఆంటోనియో, శాంటా మోనికా మౌంటెయిన్స్ నేషనల్ పార్క్, పాయింట్ ముగు స్టేట్ పార్క్, మలీబు, పాలిసేడ్స్.. వంటివన్నీ అటవీ ప్రాంతాలే. వేల హెక్టార్లల్లో విస్తరించి ఉందీ అటవీ ప్రాంతం మొత్తం కూడా.
పసిఫిక్ పాలిసేడ్స్‌లో తొలుత దావానలం చెలరేగింది. 23,000 మందికి పైగా నివాసం ఉండే ప్రాంతం ఇది. మంటలు చెలరేగిన తరువాత ఈ ప్రాంతం మొత్తాన్నీ ఖాళీ చేయించారు. పాలిసేడ్స్ అటవీ ప్రాంతానికి ఆనుకునే ఉన్న లాస్ ఏంజిలిస్‌లోని పలు జనావాసాలను అగ్నికీలలు చుట్టుముట్టాయి.

లాస్ ఏంజిలిస్, ఆరెంజ్, వెంచురా, శాన్‌డియాగో, శాన్ బెర్నార్డినొల్లో భారీ అపార్ట్‌మెంట్లు సైతం మంటల బారిన పడ్డాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వేలాదిమంది తమ నివాసాలను ఖాళీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
హాలీవుడ్ స్టార్ హీరో మెల్ గిబ్సన్, ఆంటోనీ హాప్‌కిన్స్ నివాసాలు పూర్తిగా దగ్ధమైంది. బూడిదకుప్పలా మారాయి. ప్రమాద సమయంలో మెల్ గిబ్సన్ ఇంట్లో లేరు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం టెక్సాస్ వెళ్లారు. బిల్లీ క్రిస్టల్, జెనికా, జెఫ్ బ్రిడ్జెస్, పారిస్ హిల్టన్, క్యారీ ఎల్విస్, మార్క్ హామిల్, మ్యాండీ మూర్, జేమ్స్ వుడ్, మిలో వెంటిమిగ్లియా, ఆడమ్ బ్రాడీ, జాన్ గుడ్‌మ్యాన్, అన్నా ఫేరిస్.. నటులు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఈ కార్చిచ్చు ప్రభావం వల్ల వాతావరణం తీవ్రంగా ప్రభావితమైంది. ఉష్ణోగ్రత అమాంతంగా పెరిగింది. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోన్నాయి. వేడి గాలుల తీవ్రత 80 నుంచి 130 కిలోమీటర్ల వరకూ పెరుగుతుందని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. మరో 24 గంటల పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications