మేగజైన్ కథనం: నటితో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఎఫైర్
ప్యారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఫ్రాంకోయిస్ హోలాండే (59) తరచూ రాత్రిపూట స్కూటర్‌పై వెళ్లి ఓ నటి దగ్గర గడిపి వస్తున్నారని ఆ దేశ ప్రముఖ మేగజైన్ శుక్రవారం ప్రచురితం చేసిన తన కథనంలో పేర్కొంది. అంతేగాక ఫ్రాంకోయిస్ హోలాండే ఆ నటి జూలియా గయెట్ (41) నివసిస్తున్న అపార్ట్ మెంట్‌లోకి వెళుతున్న ఫొటోలను కూడా ప్రచురితం చేసింది.
నటి గయెట్ ఫొటోలతో కూడిన ఏడు పేజీల ప్రత్యేక కథనాన్ని ఆ మేగజైన్ ప్రచురితం చేసింది. ప్యారిస్‌లోని నటి గయెట్ నివాసముంటున్న అపార్ట్‌మెంట్లోకి ఫ్రోంకోయిస్ వచ్చినట్లుగా ఉన్న ఫొటోలను ప్రచురితం చేసింది. ఈ సంఘటన డిసెంబర్ 30న చోటు చేసుకుందని తెలిపింది. హోలాండే నివాసముంటున్న ఎలిసీ ప్యాలెస్‌కు గయెట్ అపార్ట్‌మెంట్‌కు దగ్గరగానే ఉందని పేర్కొంది. హోలాండే వచ్చే ముందు అతని భద్రతా సిబ్బంది నటి అపార్ట్ మెంట్ వద్ద తనిఖీలు నిర్వహించారని పేర్కొంది.

ఆ తర్వాత హోలాండే, అతని ప్రత్యేక భద్రతా అధికారి హెల్మెట్ ధరించి స్కూటర్‌పై నటి గయెట్ అపార్ట్‌మెంట్‌కు వచ్చారని తెలిపింది. మరుసటి రోజు ఉదయం ప్రత్యేకాధికారి స్కూటర్‌పై వచ్చారని, అతని వెంట హోలాండే వెళ్లిపోయారని తెలిపింది. ఆ తర్వాత గయెట్ కూడా అపార్ట్ మెంట్‌నుంచి బయల్దేరారని పేర్కొంది.
కాగా మేగజైన్ ప్రచురితం చేసిన ఆ కథనంపై ఫ్రాంకోయిస్ హోలాండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత విషయాలను ప్రచురితం చేయడమేంటని, తన ప్రైవసీకి భంగం కలిగించినందుకు ఆ పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే నటి నివాసానికి వెళ్లిన విషయాన్ని మాత్రం ఫ్రోంకోయిస్ హోలాండే ఖండించకపోవడం గమనార్హం. ఈ కథనం వారిద్దర్నీ ఇరకాటంలో పెట్టేదిగా ఉందని ఫ్రాంకోయిస్ సన్నిహితుడు ఒకరు అభిప్రయడ్డారు.












Click it and Unblock the Notifications