పెను భూకంపం: తీర ప్రాంతాల్లో అలజడి
జకర్తా: ఇండోనేషియాలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి. భూకంప తీవ్రతకు సునామీ వస్తుందనే భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనికి అనుగుణంగా సునామీ అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కొద్దిసేపటి తరువాత దీన్ని ఉపసంహరించుకున్నారు.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఈ సాయంత్రం ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా రికార్డయింది. జావా ద్వీపానికి నైరుతి దిశగా ఉండే యోగ్యకర్త నగరం సమీపంలో భూ ప్రకంపనలు నమోదైనట్లు యూరోపియన్ మిడ్ టెర్రయిన్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. యోగ్యకర్త నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్నీ భూకంప కేంద్రంగా గుర్తించారు.

ఉపరితలం నుంచి 25 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది. తీర ప్రాంతం కావడం వల్ల సునామీ భయాలు వ్యక్తం అయ్యాయి. యోగ్యకర్త సిటీ సహా పలు చోట్ల భూకంప ప్రభావం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో భవనాలకు బీటలు వారినట్లు సమాచారం అందింది.
భూమి కంపించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్లపైకి పరుగులు పెట్టారు. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండే దేశాల్లో ఇదీ ఒకటి. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పాపువా న్యూగినియా, న్యూజిలాండ్, అంటార్కిటికా- ఈ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications