నరాలు తెగే ఉత్కంఠ : స్టూలుపై ల్యాండయిన విమానం
చరిత్రలో కనీ విని ఎరుగని ఘటన ఇది. ఇంతకుముందెప్పుడూ ఊహా మాత్రంగానైనా ఇలాంటి ఫీట్ గురించి ఎవరూ ఊహించి ఉండరు. కానీ కొన్ని అనివార్యతల నడుమ అప్పుడప్పుడు అద్భుతాలు చోటు చేసుకుంటాయనే మాట ఇది చూసిన తర్వాత నిజమే అనిపించకమానదు. పైలట్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ లో ఓ సెన్సేషన్ గా మారింది.
విధుల్లోకి వచ్చిన మెరైన్ క్రాప్స్ పైలట్ విలియమ్ మహోనీ.. అమెరికన్ యుద్ద నౌక యూఎస్ఎస్ బతాన్ ని టేకాఫ్ చేశారు. అయితే తిరిగి ల్యాండ్ అయ్యే సమయంలో విమానం ముందు చక్రాలు తెరుచుకోకపోవడంతో.. ల్యాండింగ్ పై ఉత్కంఠ ఏర్పడింది. అయితే పైలట్ సమయస్ఫూర్తి విమానాన్ని పెద్ద గండం నుంచి గట్టెక్కించింది.

యుద్ద నౌకపై ల్యాండింగ్ సమయంలో సాంకేతిక కారణాలతో విమానం ఫ్రంట్ వీల్ తెరుచుకోలేదు. దీంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి 'స్టూల్ ప్లాన్' ఆలోచన చేశాడు పైలట్. ఇదే విషయాన్ని అధికారులకు చేరవేశాడు. పైలట్ చెప్పిన ప్రకారం.. ఒక పెద్ద స్టూలును తీసుకొచ్చి యుద్ద నౌక మధ్యలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నౌక పైకి విమానాన్ని తీసుకొచ్చిన పైలట్.. సరిగ్గా 20 అడుగుల ఎత్తులో విమానాన్ని స్థిరంగా నిలిపి, మెల్లిగా కిందకి దించుతూ.. విమానం ముందు భాగం స్టూలుపై ల్యాండయ్యేలా చేయడంలో సఫలమయ్యాడు.
పైలట్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. వైమానిక చరిత్రలో ఇదొక అరుదైన ఘటనగా నిలిచిపోతుందంటున్నారు విమానయాన అధికారులు. ఏదేమైనా ఇదంతా చూశాక పైలట్ కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేమంటున్నారు నెట్ లో ఈ వీడియోని తిలకించినవాళ్లు.












Click it and Unblock the Notifications