సూర్య సినిమాలోలానే: కడుపులో 27 డ్రగ్స్ బ్యాగ్స్!
మసాచుసెట్స్: తమిళ కథానాయకుడు సూర్య నటించిన వీడొక్కడే చిత్రంలోలానే అమెరికాలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ చిత్రంలో సూర్య స్నేహితుడు ఓ ముఠా కోసం కడుపులో డ్రగ్స్‌ను తీసుకెళ్తాడు. అచ్చం అలాగే ఓ వ్యక్తి కడుపులో డ్రగ్స్ తీసుకెళుతూ అనుకోకుండా దొరికిపోయాడు.
కాగా, ఆ వ్యక్తి కడుపులోంచి వైద్యులు 27బ్యాగుల హెరాయిన్‌ను బయటకు తీశారు. వివరాల్లోకెళితే.. మైగ్యుల్ రోడ్‌రేజ్ అనే 51 ఏళ్ల వృద్ధుడు అమెరికాలోని సలేమ్ నుంచి మసాచుసెట్స్‌కు అక్రమంగా మాదకద్రవ్యాలు (డ్రగ్స్) రవాణా చేయడానికి ఏకంగా 27 బ్యాగుల హెరాయిన్‌ను మింగేశాడు.
మింగేసిన బ్యాగుల్లో ఓ బ్యాగు చిరిగిపోవడంతో ఆ డ్రగ్స్ అతని పొట్టలోకి వెళ్లాయి. ఓవర్‌డోస్ కావడంతో మైగ్యుల్ సలేమ్లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడని.. అక్కడి వైద్యులు అతని పొట్ట నుంచి 27 బ్యాగుల హెరాయిన్‌ను బయటికి తీశారని పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ తర్వాత ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.