తీర ప్రాంతంలో భారీ భూకంపం: తరగతులు రద్దు: రాబోయే మూడు గంటల్లో ముప్పు
ద్వీపదేశం ఫిలిప్పీన్స్‌లో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి. సునామీ వార్నింగ్ సైతం జారీ అయింది. ఉప్పెను ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ తీర ప్రాంతాలను హెచ్చరించారు. తీర ప్రాంతాలకు ఖాళీ చేయిస్తోన్నారు. భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. భయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు రాలేదు.
ఫిలిప్పీన్స్ నైరుతి ప్రాంతంలోని దవావో ప్రావిన్స్ లో ఆ దేశ కాలమానం ప్రకారం.. ఉదయం 9:43 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. రాజధాని మనీలాకు నైరుతి దిశగా సుమారు 1,400 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రావిన్స్. ఈ ప్రావిన్స్ లోని కోటాబాటా సిటీ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే, ఫిలిప్పీన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సీస్మాలజీ తెలిపింది. సముద్ర తీర ప్రాంత నగరం ఇది.

ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున భూఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు జియాలాజికల్ సర్వే తెలిపింది. దీని తీవ్రత దవావో ప్రావిన్స్ మొత్తం కనిపించింది. ఈస్ట్ సమర్, సదరన్ లెటె, లెటె, దినగట్ ఐలాండ్స్, సూరిగావ్ డెల్ నోర్టే, సూరిగావ్ డెల్ సుర్, దావవో ఓరియంటల్ తీరప్రాంతాల ప్రజలు భయంతో రోడ్ల మీదికి పరుగులు తీశారు. స్థానికులు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికస్థాయి ప్రకంపనలు నమోదయ్యాయి. మిండానావో, దావావో, కోటాబాటో నగరాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. క్లాసులను రద్దు చేసినట్లు కోటాబాటో సిటీ మేయర్ బ్రూస్ మటాబలావ్ ప్రకటించారు. అన్ని స్థాయిలలో తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భూకంప తీవ్రత కోటాబాటోలో అధికంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రెండు నుంచి మూడు గంటల్లో సునామీ అలలు తీరాన్ని తాకొచ్చని తెలిపారు.
ఫిలిప్పీన్స్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటి. ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి గానీ.. ఈ స్థాయిలో భూమి ప్రకంపించడం సుదీర్ఘకాలం తరువాత ఇదే తొలిసారి. బొలీవియా, చిలి, ఈక్వెడార్, పెరు, కోస్టారికా, గ్వాటెమాలా, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా.. రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications