నేడు భూమిపైకి సౌర తుఫాను, కాసేపు ఉపగ్రహ సేవలకు అంతరాయం!
వాషింగ్టన్: భూమిని సౌర తుఫాను ముంచెత్తనుంది. సూర్యుడి ఉపరితలంలో పెద్దమొత్తంలో కాస్మిక్ కణాలు ఢీకొట్టి అసాధారణ అయస్కాంత విస్ఫోటనాలు ఏర్పడ్డాయి. దీంతో భారీస్థాయిలో ఏర్పడిన విద్యుదావేశ పదార్థాలతో కూడిన ఓ మేఘం భూమి వైపు దూసుకు వస్తోంది. ఇది ఆదివారం భూమిని తాకే ప్రమాదం ఉంది. అది జీ1 స్థాయి సౌర తుఫాను.
ఇది స్వల్ప తీవ్రత కలిగిన సౌర తుఫాను. ఈ నెలలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోనుండటం ఇదే మొదటిసారి. దీని వల్ల స్వల్పకాలం పాటు ఉపగ్రహ ఆధారిత సేవలకు ఆటంకం కలిగే అవకాశముంది. ఈ మేరకు ఓ వెబ్ సైట్ వివరాలు తెలిపింది. సూర్యుడి ఉపరితలంపై కనిపిస్తున్న ఓ భారీ రంధ్రం భూమి వైపుగా సౌర పవనాలను నెడుతోందని చెబుతూ నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ తీసిన చిత్రం ప్రచురించింది.

ఇందులో సూర్యుడి బాహ్య పొరలో ఓ రంధ్రం కనిపిస్తోంది. ఇక్కడి నుంచే సూర్యుడి అయస్కాంత క్షేత్రం తెరచుకుని భారీ పరిమాణంలో వాయువులు బయటకు వస్తాయి. చిత్రంలో ఈ రంధ్రం చీకటిగా కనిపిస్తోంది. భారీ వెలుగులు విరజిమ్మే వాయువులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.
కాగా, సౌర తుఫాను భూమి వైపు దూసుకు వస్తే భూఅయస్కాంత వాతావరణం దెబ్బతిని ఉపగ్రహాల పనితీరుకు ఆటంకం కలుగుతోంది. సూర్యుడి కరోనా నుంచి వెలువడే కణాలు భూమిపై ఉండే అయస్కాంత వాతావరణంలోని పరమాణావులు, అణువులపై ప్రభావం చూపడం వల్ల ఆ శక్తితో పని చేసే వ్యవస్థ దెబ్బతింటుంది. పర్యావసనంగా జీపీఎస్, సెల్ ఫోన్ సిగ్నల్స్, టీవీలు పని చేయవు.












Click it and Unblock the Notifications