పాకిస్తాన్.. ఇక శతృ దుర్భేధ్యం: అత్యంత బలమైన దేశాలతో ప్రత్యేక కూటమి
మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న సరిహద్దు భద్రతా సమీకరణాల నేపథ్యంలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ జట్టు కట్టాయి. ఓ త్రైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జెడ్డా వేదికగా ఈ మూడు దేశాధినేతలు ఈ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా దేశాల మధ్య సైనిక, రక్షణ సహకారాన్ని విస్తృతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సమక్షంలో ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ఖరారైంది. పరస్పర వాణిజ్య బలోపేతం, స్థిరత్వం, ప్రాంతీయ భద్రత వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న వైరాన్ని తగ్గించడానికి అవసరమైన ఉమ్మడి దౌత్య చర్యలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.

మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ (Mecca Joint Defence Agreement) పేరుతో ఈ ఒప్పందం కుదిరంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, చమురు నిల్వలు భారీగా ఉన్న సౌదీ అరేబియా, అణు సామర్థ్యం కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశం పాకిస్తాన్, నాటో కూటమిలో రెండో అతిపెద్ద శక్తివంతమైన సైనిక బలగాన్ని కలిగి ఉన్న టర్కీ.. ఒకే ఒప్పందం పరిధిలోకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమౌతోంది.
టర్కీ.. రక్షణ రంగంలో అత్యంత వేగంగా స్వయం సమృద్ధి సాధిస్తుండడంతో ఈ నయా కూటమి ద్వారా ఆ టెక్నాలజీని సౌదీ అరేబియా, పాకిస్తాన్ పంచుకోనున్నాయి. ఈ రకంగా పాకిస్తాన్ శతృ దుర్భేధ్యంగా తయారైంది. ఈ ఒప్పందంలో భాగంగా ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడం, ఆర్మీ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇవ్వడం, రక్షణ రంగానికి సంబంధించిన సైనిక సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, పరస్పర నిఘా సమచారాన్ని పంచుకోవడం వంటివి ఇందులో కీలకం.
భవిష్యత్తులో కూటమిలోని ఏ దేశంపైనా దాడులు జరిగితే, దానిని కూటమి మొత్తానికి జరిగిన దాడిగా భావిస్తాయి. ఈ మూడు కలిసి ఉమ్మడి దాడులకు దిగుతాయి. ఈ మూడు దేశాల కూటమి సైనిక పరంగా ఎంతో బలీయమైనదిగా మారింది. ఇరాన్‌తో నెలకొన్న ప్రతిష్టంభన, వ్యూహాత్మక ప్రాంతాలపై దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా ఈ ఒప్పందానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తన దేశ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి కొత్త దారులను అన్వేషించడంలో భాగంగా ఇందులో చేరింది.





Click it and Unblock the Notifications