మిరాకిల్ : ఇక యవ్వనాన్ని పొడిగించేసుకోవచ్చు..
అమెరికా : వైద్యశాస్త్రంలో వెలువడుతున్న అద్భుత ఆవిష్కరణలు భవిష్యత్తులో మానవుడి జీవిత క్రమాన్ని పూర్తిగా మార్చేస్తాయనడానికి ఇలాంటి పరిశోధనలను మించిన ఉదాహరణ లేదు. మనిషి జీవిత పరిణామ క్రమాన్ని నియంత్రించే దిశగా పరిశోధనలు చేస్తున్న అమెరికన్ శాస్త్రవేత్తల ప్రయోగాలు సఫలమైతే.. ప్రతి మనిషి తన యవ్వన దశను ఇంకొంతకాలం పొడిగించుకోవడానికి అవకాశం ఏర్పడనుంది.
బాల్యం, వృద్ధాప్యం కన్నా యవ్వనమంటేనే ఎక్కువ మోజు పడే మనుషులకు నిజంగా ఇదొక వరమే. అమెరికాలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రస్తుతం మనుషుల యవ్వనాన్ని పొడిగించి, వృద్దాప్యాన్ని కొంత ఆలస్యం చేసే పరిశోధనల్లో తలమునకలై ఉన్నారు.
ఇంతకుముందు కూడా ఈ తరహా పరిశోధనలు జరిగినప్పటికీ.. జన్యువల క్రమాన్ని మార్చే సంక్లిష్ట ప్రక్రియలతో అప్పటి పరిశోధనలు ముడిపడి ఉండగా, తాజా పరిశోధనలు మాత్రం నిత్య జీవితంలో వాడే సాధారణ మెడిసిన్ ఆధారంగానే కొనసాగుతున్నాయి. కణాల జీవిత క్రమాన్ని నిర్దేశించే మైటోకాండ్రియాను ఈ మాత్ర ప్రభావితం చేస్తుండడంతో వయసుకు సంబంధించిన మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.

విటమిన్ విటమిన్ బీ, సీ, డీ, ఫోలిక్ యాసిడ్, గ్రీన్ టీ వంటి 30 రకాల మూలకాల నుంచి అభివ్రుద్ది చేసిన ఈ మాత్ర ద్వారా మనిషి యవ్వనాన్ని పొడిగించే దిశగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మాత్ర ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
ప్రస్తుతం ఎలుకల మీద ఈ మాత్రను ప్రయోగించడంలో సఫలమయ్యారు శాస్త్రవేత్తలు. మెదడులో సగం వరకు కణాలు దెబ్బతిన్న కొన్ని ఎలుకలపై ఈ మాత్రను కొన్ని నెలల పాటు ప్రయోగించారు. దీంతో ఎలుకలు అంతకుముందు కంటే ఆరోగ్యంగా తయారవడంతో పాటు కంటి చూపు, వినికిడిలో కూడా ఎలుకలు మునుపటి కంటే చురుగ్గా ఉంటున్నట్టు గుర్తించారు.
శాస్త్రవేత్తల ప్రయోగాల ఫలితంగా 22 నెలలు వయసున్న ఎలుకల్లో 50 శాతం వరకు వయస్సు వెనక్కి మళ్లినట్టుగా తేల్చారు. ఎలుకల్లో 22 నెలల వయసును మానవులకు అన్వయించి చూసుకుంటే 70 నుంచి 80 ఏళ్లకు సమానం కాగా, ఈ మాత్ర ప్రభావంతో వ్రద్దాప్య ఛాయలు వెనక్కి మళ్లే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications