ఎవరీ అభిషేక్ కంబ్లీ..? ఈయన అండతోనే ట్రంప్ రెచ్చిపోతున్నారు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజు నుంచే తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రోజుకో షాకింగ్ నిర్ణయం తీసుకుంటూ వలసజీవులు, ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, అక్రమ వలసదారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాల నుంచి జీవనం కోసం అమెరికాకు అక్రమ మార్గాల్లో వచ్చిన వారిని వెనక్కు పంపించారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ నిర్వహించారు. అంతేకాక అనేక దేశాలపై టారిఫ్ లు విధించారు. అగ్రరాజ్యంలోని ఫెడరల్ ఉద్యోగులపై కఠిన చర్యలకూ పాల్పడ్డారు. ఇలా అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు ట్రంప్.
అయితే తాజాగా ఏలియన్ ఎనిమీస్ యాక్ట్- 1798 ను ఉపయోగించి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వెనీజులా గ్యాంగ్ కు చెందిన 238 మందిని అగ్రరాజ్యం నుంచి ఎల్ సాల్వడార్ కు తరలించారు. వారిని అమెరికాలోనే ఉంచాలని కోర్టు ఆదేశించినా ట్రంప్ మాత్రం వారిని దేశం నుంచి పంపించారు. ట్రంప్ ఇటీవల తన న్యాయ విభాగంలో నియమించిన భారత సంతతి లాయర్ అభిషేక్ కంబ్లీ.. ట్రంప్ తరఫును కోర్టులో వాదించి ట్రంప్ నకు భారీ ఉపశమనాన్ని కలిగించారు.

అంతేకాక అభిషేక్ కంబ్లీ ఇచ్చిన సలహాలు, సూచనల కారణంగానే ట్రంప్ ఆ వెనీజులా గ్యాంగ్ కు చెందిన వారిని దేశం నుంచి పంపించేశారాట. ఇప్పుడు ట్రంప్ న్యాయపరమైన అన్ని చిక్కులనూ, అనుమానాలనూ అభిషేక్ దగ్గరుండి తీరుస్తున్నారు. మరి ఎవరీ అభిషేక్ కంబ్లీ..?
ఎవరీ అభిషేక్ కంబ్లీ..?
భారత సంతతికి చెందిన అభిషేక్ కంబ్లీ గత నెలలోనే యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ విభాగంలో చేరారు. డిప్యూటీ అసోసియేట్ ఆటార్నీ జనరల్ గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. న్యాయపరమైన చిక్కుల్లో ప్రస్తుతం ట్రంప్ నకు ఈయనే అండగా నిలుస్తున్నారు.
భారత్ లోనే జన్మించిన అభిషేక్ కంబ్లీ.. మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో అమెరికా వెళ్లారు. కంబ్లీ చిన్నతనం మొత్తం నార్ వాల్క్ లో సాగింది. 2006లో యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలో పనిచేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ నాట్రో డ్యామ్ నుంచి లా పట్టా సాధించారు. 2013లో డైస్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో చేరారు. లీడ్ ప్రాసిక్యూటర్, ఫంక్షనల్ సూపర్ వైజర్ గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ గా ప్రొమోట్ అయ్యారు. దాదాపు 4వేల మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి హెడ్ గా పనిచేశారు.
2019లో కంబ్లీ యూనైటెడ్ స్టేట్స్ ఆటార్నీ ఆఫీస్ లో చేరారు. అసిస్టెంట్ యూఎస్ ఆటార్నీగా విధులు నిర్వర్తించారు. అనేక ఫెడరల్ క్రైమ్స్ ను వాదించారు. అమెరికాకు చెందిన ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను విజయవంతంగా వాదించారు. ప్రస్తుతం ట్రంప్ న్యాయ సలహా మండలిలో కీలకమైన వ్యక్తిగా అభిషేక్ కంబ్లీ కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications