అద్భుతం: మృత్యుంజయులు అంటే వీళ్లే.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి బయటికి!
చుట్టూ కటిక చీకటి.. గాలి ఆడని భయంకర పరిస్థితి.. సహాయక బృందాలకు శబ్దాలు వినపడటం కూడా కష్టమైన ప్రదేశం. గత నెల 26న సంభవించిన భయానక జలప్రళయం నేపాల్‌ను ఎంతలా అతలాకుతలం చేసిందో తెలిసిందే. ప్రళయం వచ్చి తొమ్మిది రోజులు గడిచిపోవడంతో టన్నెళ్లలో చిక్కుకున్నవారు బతికే అవకాశాలు లేవని భావిస్తున్న తరుణంలో ఒక అద్భుతం జరిగింది. మృత్యుంజయులుగా ఇద్దరు కార్మికులు చీకటి గుహల నుంచి క్షేమంగా బయటపడ్డారు. శ్రమించిన రెస్క్యూ టీమ్‌ల శ్రమ ఫలించడంతో ఈ ఘటన దేశమంతటా కొత్త ఆశలు చిగురింపజేసింది.
త్రిశూలి 3A జలవిద్యుత్ ప్రాజెక్టుకు చెందిన సుమారు 4 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌లో శిథిలాలు తొలగిస్తుండగా.. లోపలి నుంచి సన్నటి గొంతుకలు వినిపించడంతో సహాయక బృందాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు భారీ యంత్రాలతో లోపలికి చేరుకుని శిథిలాలను తొలగించారు. ఆ టన్నెల్ నుంచి 'సంజయ్ షా', 'కబీర్ మహర్జన్' అనే ఇద్దరు కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఒళ్లంతా బురదతో ఉన్న ఒక కార్మికుడిని రెస్క్యూ సిబ్బంది తమ భుజాలపై మోసుకెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేశాయి. సకాలంలో ఆక్సిజన్ అందించడంతో వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.

ఇంకా వందలాది మంది అచూకీ లభ్యం కావాల్సి ఉంది!
ఈ ఇద్దరి రెస్క్యూతో మిగిలిన బాధితుల కుటుంబాల్లో ఆశలు రేకెత్తాయి. అయితే జలవిద్యుత్ ప్రాజెక్టుల పరిధిలో పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. నేపాల్ వ్యాప్తంగా ఉన్న 12 జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 900 మంది కార్మికులు గల్లంతవ్వగా, అందులో సుమారు 500 మందికి పైగా వివిధ టన్నెళ్లలోనే చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఒక్క త్రిశూలి ప్రాజెక్టు వద్దే ఇప్పటికీ 40 మంది అచూకీ లభించాల్సి ఉంది. రసూవా లాంగ్‌టాంగ్ ప్రాజెక్టులో ఆర్మీ బృందాలు టన్నెల్‌లోకి 150 మీటర్లు వెళ్లి ఇద్దరి మృతదేహాలను వెలికితీశాయి.
సవాలుగా మారిన కొండచరియలు.. వాతావరణం!
విపత్తు సంభవించిన ప్రాంతాలు ఎత్తైన పర్వత శ్రేణుల్లో ఉండటంతో అక్కడికి భారీ యంత్రాలను తరలించడం అత్యంత కష్టతరంగా మారింది. రహదారులు తెగిపోవడం, మళ్లీ మళ్లీ కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఆగస్టు 26న వచ్చిన ఈ ప్రళయానికి నేపాల్‌లో ఇప్పటివరకు 1,259 మంది ప్రాణాలు కోల్పోగా, 5,000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ ప్రభావం పొరుగునే ఉన్న టిబెట్ పైనా పడింది.
48 గంటలే కీలకం అనుకున్న చోట విస్మయం!
సాధారణంగా ఇలాంటి టన్నెల్ ప్రమాదాల్లో చిక్కుకున్నవారికి మొదటి 48 గంటలే అత్యంత కీలకమని సైనిక నిపుణులు చెబుతుంటారు. గాలి ఆడకపోవడం, కొండచరియల ఒత్తిడి, మానసిక భయం వల్ల ఎక్కువ రోజులు బతకడం అసాధ్యం. కానీ, ఏకంగా తొమ్మిది రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడటం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ అద్భుతం మిగిలిన టన్నెళ్లలో ఉన్నవారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకురావచ్చనే నమ్మకాన్ని ఆర్మీ సహాయక బృందాలకు అందించింది.
VIDEO | Trishuli, Nepal: Two people rescued alive today from the tunnel of Trishuli–3 'A' Hydropower Project; search for others continues.
— Press Trust of India (@PTI_News) September 4, 2026
(Source: Security Force)
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/gNxbkPrl73














Click it and Unblock the Notifications