అమెరికాలో ప్రధాని మోదీ బస చేసిందెక్కడ : 204 ఏళ్ల చరిత్ర - ఆకట్టుకొనే నిర్మాణం: ప్రత్యేకతలు ఏంటంటే..!!
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉన్న ఆయన రెండో రోజు పర్యటనలో భాగంగా క్వాడ్ సదస్సుతో పాటుగా..అమెరికా అధినేత జో బైడెన్ తో ద్వైపాక్షిక అంశాల పైన చర్చలు జరపనున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ తో జరిగిన చర్చలు ఫలప్రదం అయినట్లు వెల్లడించారు. అదే సమయంలో కమలా హ్యారీస్ ను ప్రధాని మోదీ ప్రశంసించటంతో పాటుగా భారత్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. కమలా పూర్వీకులు భారతీయులు కావటంతో..కాశీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన బహుమతులను కమలా హ్యారీస్ కు ప్రధాని అందించారు.

అమెరికాలో మోదీ బస చేసింది ఇక్కడే
భారత్ నుంచే బయల్దేరే సమయం లోనే అమెరికా పర్యటనల కోసం వినియోగించే ప్రత్యేక విమానంలో మోదీ బయల్దేరారు. ఇక, వాషింగ్టన్ లో ప్రధాని మోదీకి అక్కడి బైడెన్ ప్రభుత్వంలోని అధికారులతో పాటుగా భారత రాయబార కార్యాలయ సిబ్బంది.. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. ఇక, అమెరికా వెళ్లిన మోదీకి బస ఎక్కడ ఏర్పాటు చేసారు..ఎలా ఉంటుందనేది ఆసక్తి కర అంశం. అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ వాషింగ్టన్ డీసీలోని విలార్డ్ హోటల్‌లో ఉంటున్నారు.

204 ఏళ్ల నాటి హోటల్ లో అన్నీ ప్రత్యేకతలే
ఈ హోటల్ 204 ఏళ్ల కిందటిది. 1816లో దీనిని నిర్మించగా.. ఇప్పటి వరకూ ఎన్నో మార్పులు చేశారు. పర్యటనకు వచ్చే దేశాధినేతలు సాధారణంగా ఇదే హోటల్‌లో బస చేస్తుంటారు. దీంతో ఈ హోటల్ దగ్గర ఎప్పుడూ చాలా ఎక్కువ సంఖ్యలో భద్రతా బలగాలు ఉంటాయి. ఈ హోటల్‌లో మొత్తం 9 సూట్లు ఉన్నాయి. వీటిలో కనీసం ఐదింట్లో దేశాధినేతలు వచ్చినప్పుడు బస చేస్తుంటారు. అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్‌ల పేరు మీద కూడా ఇందులో సూట్లు ఉన్నాయి. ఈ హోటల్‌లో బుకింగ్స్ కొన్ని నెలల ముందుగానే చేసుకోవాలి.

అమెరికా సాంప్రదాయలు ఉట్టిపడేలా
అమెరికా సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ హోటల్ ఇంటీరియర్ ఉంటుంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో మోదీ అమెరికాకు రాగా..అప్పుడు సైతం ఇదే హోటల్ లో బస చేసారు. ఇక, అక్కడే ప్రఖ్యాత గ్లోబల్ సంస్థల సీఈవోలతో ప్రధాని సమావేశమయ్యారు. ఇక, ప్రధాని తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడుతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏం చర్చిస్తారు.. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ పైన భారత వైఖరి ఏ విధంగా ఉండే అవకాశం ఉందనేది స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు.

బైడన్ తో కీలక భేటీ..ఐరాసాలో ప్రసంగం
అదే విధంగా క్వాడ్ సదస్సులోనూ ప్రధాని కీలకంగా వ్యవహరించనున్నారు. 25న ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో మోదీ ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. ఐక్యరాజ్య సమితి వేదిక నుంచి ప్రపంచ దేశాలకు భారత ప్రధాని ఇచ్చే సందేశం పైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆ సమావేశంతో ప్రధాని అమెరికా పర్యటన పూర్తి కానుంది. ఆ తరువాత ఆయన నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. ఇక, ఇప్పుడు ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ నిర్వహించే సమావేశాలు..నిర్ణయాల పైన ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications