కరోనా సోకిన వ్యక్తికి మంకీపాక్స్..! అరుదైన ఘటన
ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తుంటే.. మరోవైపు మంకీపాక్స్ అన్నిదేశాలను ఆందోళనపరుస్తోంది. కేసులు రోజురోజుకు పెరుగుతూ 75 దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది. ఇది సోకినవారికి అత్యంత సన్నిహితంగా మెలిగితే ఇతరులకు సోకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇతర పద్ధతుల్లో కూడా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తున్నట్లు డబ్యూహెచ్‌వో అధికారులు వెల్లడించారు.
కాలిఫోర్నియాకు చెందిన మిట్కో థాంప్సన్ కు ఈ ఏడాది జూన్‌లో కొవిడ్ సోకింది. ఆ తర్వాత కొద్ది రోజులకు వీపు, కాళ్లు, చేతులు, మెడపై ఎర్రటి బొబ్బలు కనిపించడంతో పరీక్షలు నిర్వహింపచేశారు. అది మంకీపాక్స్ అని వైద్యులు తెలిపారు. తనకు మంకీపాక్స్, కరోనా రెండూ ఉన్నాయని వైద్యులు తెలిపారని మిట్కో ఓ ఛానల్‌కు చెప్పారు. జ్వరం, శ‍్వాస తీసుకోలేకపోవటం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉన్నాయన్నారు.

రెండు వైరస్ లు ఒకేసారి సోకడం అరుదని, దీనిపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు పేర్కొనగా, ఆ దేశం మాత్రం దీన్ని అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. మంకీపాక్స్ కేసుల్లో 95 శాతానికి పైగా స్వలింగ సంపర్కుల్లోనే వెలుగు చూస్తుండటంతో అటువంటి పురుషులను సునిశితంగా పరిశీలిస్తుండాలని డబ్యూహెచ్‌వో సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 16వేల కేసులు నమోదవగా, 5 మరణాలు సంభవించాయి.
అమెరికాలో ఇప్పటి వరకు 2,400 మంకీపాక్స్ కేసులు నమోదవగా, తాజాగా ఇద్దరు చిన్న పిల్లల్లో మంకీపాక్స్ నిర్ధారణైంది. అమెరికాలో కరోనా కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. బీఏ5 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications