హజ్ యాత్రలో 1300 మందికిపైగా మృతి: కారణం ఇదే, భారతీయులు ఎంతమందంటే?
హజ్ యాత్రలో ఎండతీవ్రతకు మరణించినవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది హజ్ యాత్రలో 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే అందుకు కారణమమని సౌదీ అరేబియా అధికారిక వర్గాలు తెలిపాయి. చనిపోయిన వారిలో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా మక్కాకు వచ్చినవారేనని ఆదివారం వెల్లడించాయి.
చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి తీవ్రమైన ఎండల్లో నడుచుకుంటూ హజ్ యాత్రకు వచ్చారని సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-జలజెల్ తెలిపారు. 95 మంది యాత్రికులకు చికిత్స అందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, క్షతగాత్రుల్లో కొంత మందిని మెరుగైన చికిత్స కోసం విమానాల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు తరలించినట్లు మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-జలజెల్ తెలిపారు.

ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం కష్టంగా మారిందన్నారు. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. కాగా, ఈ ఏడాది హజ్ సమయంలో సౌదీలో ఉష్ణోగ్రతలు 46- 49 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. దీంతో మక్కాకు వెళ్లిన అనేక మంది ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు వదిలారు.
అయితే, హజ్ యాత్రలో ఈజిప్టుకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఈజిస్టుకు చెందిన 660 మందికి పైగా మృతి చెందారు. 31 మంది మినహా మిగతావారంతా అక్రమంగా హజ్ యాత్రకు వెళ్లినవారేనని ఆ దేశ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో వీరిని తీసుకెళ్లిన 16ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈజిప్టు నుంచి ఈ ఏడాది మొత్తం 50 వేల మంది యాత్రికులు చట్టబద్ధ అనుమతితో హజ్‌కు వెళ్లినట్లు అధికారులు వివరించారు.
చట్టవిరుద్ధంగా హజ్ యాత్రకు వచ్చిన అనేక మందిని సౌదీ అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. కొంత మంది భక్తులు ఎలాగోలా మక్కా సహా సమీప ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలకు వచ్చారు. చట్టవిరుద్ధంగా వచ్చిన హజ్ యాత్రికులకు హోటళ్లు, గూడారుల వంటి వసతులు దొరక్కపోవడం వల్లే మరణాలు సంభవించాయని అధికారులు వివరించారు.
మృతుల్లో 165 మంది ఇండోనేషియా, 98 మంది భారతీయులు, పదుల సంఖ్యలో జోర్డాన్, టునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియా సహా ఇతర దేశాల వారు ఉన్నారని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. మృతుల్లో అమెరికాకు చెందిన ఇద్దరు పౌరులు ఉన్నట్లు తెలిపింది. కాగా, గతంలోనూ పలు కారణాలతో హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 2015లో మైనాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మంది మరణించారు. అలాగే ఓ సారి మక్కాలో క్రేన్ కూలిన ఘటనలో 111 మంది చనిపోయారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది ప్రాణాలు విడిచారు. కాగా, ప్రతి ఏడాది దాదాపు 20 లక్షలకుపైగా యాత్రికులు హజ్‌కు వెళ్తుంటారు.












Click it and Unblock the Notifications