అమెజాన్ అడవుల్లో రికార్డుస్థాయి టెంపరేచర్: వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత
బ్రసీలియా: ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం.. అమెజాన్. దక్షిణ అమెరికాలో తొమ్మిది దేశాలకు విస్తరించిన అడవులు ఇవి. ఈ భూమండలానికి ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తుంటారు దీన్ని. లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన చిత్తడి నేల గల ప్రదేశం ఇదే. ఏడాది పొడవునా వర్షం కురుస్తుంటుందిక్కడ.
అత్యధికంగా బ్రెజిల్‌లో 60 శాతం మేర అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి. పెరు- 13, కొలంబియా-10 శాతం మేర విస్తరించాయి. బొలీవియా, ఈక్వెడార్, ఫ్రెంచ్ గయానా, గయానా, సురినమె, వెనిజులాలోనూ అమెజాన్ అడవుల జాడలు ఉన్నాయి. 20 నుంచి 30 శాతం మేర ఆక్సిజన్ ఇక్కడి నుంచే అందుతుందనేది సైంటిస్టుల అంచనా.

అమెజాన్ అడవుల్లో ఏడాది పొడవునా అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు. సగటు ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటుంది. అలాంటి అమెజాన్ అడవుల్లో ఉష్ణోగ్రత రికార్డుస్థాయికి చేరుకుంది. కొద్దిరోజులుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీల పైమాటే. 100 నుంచి 102 ఫారెన్‌హీట్‌గా అక్కడి టెంపరేచర్ ఉంటోంది.
ఇది- అక్కడి అనేక జీవజాలానికి మరణశాసనంలా మారింది. ప్రత్యేకించి- డాల్ఫిన్లు. డాల్ఫిన్లు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల్లో వందకు పైగా డాల్ఫిన్లు మరణించాయి. అప్పర్ అమెజాన్ నదీ తీరంలో ఉన్న లేక్ టెఫెలో డాల్ఫిన్ల మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి.
దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా మమిరువా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. వందకు పైగా డాల్ఫిన్ల మరణానికి వాతావరణ మార్పులే కారణమని ఈ బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడం అటు కరవుకు దారి తీసే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
మిగిలిన డాల్ఫిన్లను సంరక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది బ్రెజిల్ ప్రభుత్వం. ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోవడం వల్ల అమెజాన్ నదీ తీరం చాలావరకు ఎండిపోయిందని సైంటిస్టుల బృందం ధృవీకరించింది. కొన్ని అరుదైన మొక్కలు సైతం ఎండిపోతున్నట్లు పేర్కొంది.
ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని మమిరువా ఇన్‌స్టిట్యూట్ రీసెర్చర్ ఆండ్రె క్యోల్హో అభిప్రాయపడ్డారు. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల బ్రెజిల్‌లోని అమెజాన్ స్టేట్‌లో కరవు ఛాయలు ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉన్న 59 మున్సిపాలిటీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.












Click it and Unblock the Notifications