తమిళ వలస కుటుంబానికి చెందిన నవనీతం పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి
అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు విశేష కృషి చేసిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త నవనీతం నవి పిళ్లైని ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది. దశాబ్దాలుగా ఆమె చూపిన నిబద్ధత, ప్రపంచ దేశాలలో న్యాయ సూత్రాల అమలుకు ఆమె చేసిన అలుపెరగని పోరాటానికి దక్కిన సముచిత గౌరవం ఇది. ఓస్లోలో ప్రఖ్యాత నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆమె పేరును ప్రకటించింది.
దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ ఉద్యమాల్లో నెల్సన్ మండేలా వంటి మహోన్నత నాయకులకు న్యాయ సహాయాన్ని అందించడం మొదలుకుని అంతర్జాతీయ న్యాయస్థానాల్లో అత్యున్నత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించడం వరకు నవి పిళ్లై ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కమిటీ వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణలో ఆమె ఎక్కడా వెనకడుగు వేయలేదని గుర్తు చేసింది. బాధితులకు న్యాయం జరిగేలా చూడటం, అణచివేత శక్తులను ప్రశ్నించడంలోనూ ఆమె చూపిన తెగువను ప్రశంసించింది.

తమిళ వలస కుటుంబంలో..
దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో తమిళ వలస కుటుంబంలో జన్మించారు నవనీతం పిళ్లై. ఎన్నో సామాజిక అడ్డంకులను అధిగమించి న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. వర్ణవివక్ష కాలంలో తీవ్ర అణచివేతకు గురైన సామాజిక కార్యకర్తల తరఫున కోర్టులలో న్యాయపోరాటం చేశారు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ జురిడికల్ సైన్స్ పట్టా పొంది చరిత్ర సృష్టించారు. 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
క్రిమినల్ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా..
రువాండాపై ఏర్పాటైన అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నవి పిళ్లై అంతర్జాతీయ న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చారిత్రక తీర్పులను వెలువరించారు. యుద్ధ సమయాలలో మహిళలపై జరిగే అత్యాచారాలు, లైంగిక హింసను వ్యక్తిగత దాడులుగా కాకుండా మానవాళికి విరుద్ధంగా జరిగే జాతి మారణహోమ చర్యలుగా గుర్తించేలా చేశారు. ఈ విషయంలో చట్టాలకు ఊపిరి పోశారు. ఇది.. మహిళా హక్కుల పరిరక్షణలో మైలురాయిగా నిలిచింది.
BREAKING NEWSThe Norwegian Nobel Committee has decided to award the 2026 #NobelPeacePrize to Navanethem “Navi” Pillay for her efforts to promote peace and international law.#NobelPrize https://t.co/97vurspw6z
— The Nobel Prize (@NobelPrize) October 9, 2026
బలహీన వర్గాల గొంతుకగా..
అనంతరం నవి పిళ్లై 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించి అంతర్జాతీయంగా బలహీన వర్గాల గొంతుకగా మారారు. మయన్మార్‌లో మారణహోమం వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రత్యేక అడ్‌హాక్ జడ్జిగా ఆమె వ్యవహరించారు. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలపై ఏర్పడిన ఐక్యరాజ్యసమితి స్వతంత్ర విచారణ కమిషన్‌కు సైతం నేతృత్వం వహించి సంచలన నివేదికలను సమర్పించారు. ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని ప్రశ్నించడంలో ఆమె ఏనాడూ వెనకడుగు వేయలేదు.
డొనాల్డ్ ట్రంప్ సైతం..
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, సూడాన్ అత్యవసర సహాయక బృందాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా మొత్తం 287 నామినేషన్లు వచ్చాయి. అంతర్జాతీయంగా శాంతిని పెంపొందించడంలో నవి పిళ్లై చేసిన కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. గత ఏడాది కూడా మహిళకే ఈ శాంతి పురస్కారం లభించింది. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ఈ బహుమతిని అందుకున్న విషయం తెలిసిందే.













Click it and Unblock the Notifications
