పొరుగు దేశానికి కొత్త ప్రధాని- అనూహ్యంగా గద్దెనెక్కిన గెరిల్లా లీడర్..!!
ఖాట్మండు: కొద్దిరోజులుగా రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగుదేశం నేపాల్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మళ్లీ మావోయిస్టు ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. మొత్తం ఏడు పార్టీల సంకీర్ణ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తమ నేతగా పుష్ప కమల్ దహల్ ప్రచండను ఎన్నుకున్నారు ఈ ఏడు పార్టీల సంకీర్ణ కూటమి నాయకులు. ఆయన నియామకానికి నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆమోదం తెలిపారు.
అధ్యక్ష కార్యాలయం ఆమోదం..
దీనితో నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహల్ ప్రచండ నియమితులయ్యారు. ఆయనను నియమించినట్లు నేపాల్ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రిగా ప్రచండ- సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను ప్రధానమంత్రి కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది.
మూడోసారి ప్రధానిగా..
పుష్ప కమల్ దహల్ ప్రచండ- నేపాల్ ప్రధానిగా నియమితులు కావడం ఇది మూడోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రచండ.. మావోయిస్టు మాజీ గెరిల్లా నాయకుడు. 1996-2006 అంతర్యుద్ధం సమయంలో రాచరిక ప్రభుత్వాన్ని అంతం చేయడానికి తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు నాయకుడిగా ఆయనకు ముద్ర ఉంది. 2006లో మావోయిస్టులతో రాచ కుటుంబం శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది.
సీపీఎన్ ఆవిర్భావం..
దీనికి అనుగుణంగా.. ప్రచండ తన మావోయిస్టు విప్లవాత్మక ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్)ను నెలకొల్పారు. 2008-09లో ప్రధానమంత్రిగా తొలిసారిగా బాధ్యతలను స్వీకరించారు. 2016-17 మధ్యకాలంలో కూడా కొన్నాళ్లు ప్రధానిగా ఉన్నారు. కిందటి నెల 20వ తేదీన జరిగిన ఎన్నికలలో షేర్ బహదూర్ దేవుబా సారథ్యంలోని అధికార పార్టీ మెజారిటీని కోల్పోయింది. అయినప్పటికీ నేపాలీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.

హంగ్ నేపథ్యంలో..
హంగ్ పార్లమెంట్ ఏర్పాటైన నేపథ్యంలో ప్రచండ నాయకత్వాన్ని వహిస్తోన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్.. చకచకా పావులు కదిపింది. తోటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో పొత్తు పెట్టుకుంది. రబీ లామిచానేకి చెందిన నేషనల్ ఇండిపెండెంట్ పార్టీతో సహా మరో ఆరు పార్టీలతో కలిపి ప్రచండ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముచ్చటగా మూడోసారి ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications