భారతీయులకు బిడెన్-కమలా హ్యారిస్ బంపర్ ఆఫర్: 5 లక్షలమందికి అమెరికా పౌరసత్వం
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ భారతీయ ఓటర్ల రుణం తీర్చుకునే ప్రయత్నంలో పడినట్టు కనిపిస్తోంది. అమెరికాలో నివసించే భారతీయులకు బంపర్ ఆఫర్‌ను ఆయన త్వరలోనే ప్రకటించబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను కాదని తనకు అండగా నిలిచిన ఇండియన్ అమెరికన్లపై వరాల జల్లును కురిపించడానికి జో బిడెన్-కమలా హ్యారిస్ కసరత్తు చేస్తన్నట్లు చెబుతున్నారు. అమెరికాలో నివసిస్తోన్న ప్రవాస భారతీయుల్లో అయిదు లక్షల మందికి పౌరసత్వం కల్పించే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై జో బిడెన్ సంతకం చేస్తారని సమాచారం. పౌరసత్వాన్ని కల్పించాలంటూ అమెరికా వ్యాప్తంగా11 మిలియన్లకు పైగా అన్ డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నాయి. వాటిల్లో అయిదు లక్షల వరకు భారతీయులు దాఖలు చేసిన దరఖాస్తులు ఉన్నాయి. వాటన్నింటిపైనా ఆమోదముద్ర వేయడానికి జో బిడెన్ ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని అంటున్నారు.

దీనికోసం ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ బిల్లులో సవరణలు చేస్తారని, అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేయబోయే తొలి కాంగ్రెస్‌లో దీన్ని ఆమోదింపజేసేలా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. ఫ్యామిలీ విసాలను జారీ చేయడాన్ని మరింత సరళతరం చేస్తారని, బ్యాక్‌లాగ్స్ లేకుండా అప్పటికప్పుడు వాటిని జారీ చేసేలా కొత్త ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్ బిల్లును సవరిస్తారని తెలుస్తోంది. అలాగే- వేర్వేరు దేశాల నుంచి శరణార్థులుగా అమెరికాకు వెళ్లే వారి కోటాను కూడా పెంచవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం 95 వేలకు ఈ కోటా పరిమితం కాగా.. ఈ సంఖ్యను పెంచుతారని అంటున్నారు.
డెఫర్డ్ యాక్షన్ ఫర్ ఛైల్డ్‌హుడ్ అరైవల్స్ (డాకా) నిబంధనల్లో ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఉద్దేశించిన కొన్ని మార్గదర్శకాలను ఈ రిఫార్మ్ బిల్లులో పొందుపర్చబోతున్నట్లు చెబుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన జారీ చేసే విసాలు, ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్లు, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్స్ (ఎస్‌టీఈఎం) లల్లో పీహెచ్‌డీ చేయడానికి అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థులను మరింత ప్రోత్సహించేలా నూతన విధానాలను బిడెన్ ప్రభుత్వం రూపొందిస్తుందని సమాచారం. గ్రీన్ కార్డుల కోటాను కూడా పెంచడం ఖాయమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications