ప్రపంచలోనే అత్యంత తెలివైన జీవి.. మనుషులకంటే రెట్టింపు వేగంతో డెసిషన్
పక్షుల్లో కాకలంటేనే అందరికీ ఒక ప్రత్యేకమైన చురుకుదనం గుర్తుకొస్తుంది. అయితే వాటి తెలివితేటలు కేవలం మాటలకే పరిమితం కాదని, నిర్ణయాలు తీసుకోవడంలో అవి మనుషులను సైతం వెనక్కి నెట్టేశాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ టూబింగెన్ పరిశోధకులు కాకుల మేధస్సుపై నిర్వహించిన పరిశోధనలో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. మనుషులు లేదా కోతులతో పోలిస్తే కాకాలు కేవలం సగం సమయంలోనే అత్యంత కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలవని ఈ అధ్యయనం నిరూపించింది.
కాకుల నిర్ణయ శక్తిని పరీక్షించేందుకు పరిశోధకులు ఒక వినూత్న ప్రయోగం చేపట్టారు. రెండు కాకులకు టచ్‌స్క్రీన్ పై కదులుతున్న చుక్కలను చూపించారు. ఆ చుక్కలు ఎడమ వైపు వెళ్తున్నాయా లేక కుడి వైపు వెళ్తున్నాయో గుర్తించి, స్క్రీన్‌పై సరైన వైపు పొడువాలని వాటికి శిక్షణ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఆ కాకాలు కేవలం 235 మిలిసెకన్ల వ్యవధిలోనే ఏ వైపు వెళ్లాలో నిర్ణయించుకుని సరిగ్గా స్పందించాయి. చుక్కల గమనాన్ని గుర్తించడం కష్టంగా ఉన్నప్పటికీ, ఆ పక్షులు యాదృచ్ఛికంగా కాకుండా అత్యంత కచ్చితత్వంతో సమాధానాలు ఇచ్చాయి. స్పష్టమైన సంకేతాలు ఉన్నప్పుడైతే అవి దాదాపు నూటికి నూరు శాతం సరైన ఫలితాలను రాబట్టాయి.

కేవలం 70 మిలిసెకన్లలోనే మెదడులో ఆలోచన మొదలు
కాకుల మెదడు ఈ వేగాన్ని ఎలా సాధిస్తోందనే కోణంలో శాస్త్రవేత్తలు వాటి నరాల పనితీరును పరిశీలించారు. మనుషుల్లో ఉండే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మాదిరిగానే, పక్షుల మెదడులో సమాచారాన్ని ప్రాసెస్ చేసే 'నిడోపల్లియం కాండోలేటరాలే' అనే ప్రాంతంపై పరిశోధన జరిపారు. స్క్రీన్‌పై చుక్కలు కనిపించిన కేవలం 70 మిలిసెకన్ల వ్యవధిలోనే కాకుల మెదడులోని కణాలు ఏ వైపు వెళ్లాలో అంచనా వేయడం ప్రారంభించినట్లు గుర్తించారు. ఆ పక్షులు భౌతికంగా స్పందించడానికి ముందే వాటి మెదడులో ఆలోచన ప్రక్రియ చాలా వేగంగా జరిగిపోతుందని తేలింది.
వేర్వేరు మెదడు నిర్మాణాలు..
మనుషులు, ఇతర క్షీరదాలతో పోలిస్తే పక్షుల మెదడు నిర్మాణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. క్షీరదాల మాదిరిగా వాటికి పొరలుగా ఉండే సెరిబ్రల్ కార్టెక్స్ ఉండదు. అయినప్పటికీ, సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయానికి వచ్చే విషయంలో మాత్రం పక్షులు కూడా అదే ప్రాథమిక సూత్రాలను పాటిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే కోతులతో పోలిస్తే ఈ మొత్తం ప్రక్రియను కాకాలు రెట్టింపు వేగంతో పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఎగరడానికి, వేటాడడానికి కావాల్సిన పరిణామ క్రమమే కారణం
పక్షులు ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి వాటి జీవన విధానమే కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గాలిలో వేగంగా ఎగురుతున్నప్పుడు, ఆహారాన్ని వేటాడేటప్పుడు లేదా తమ చుట్టూ ఉన్న వాతావరణంలో తక్షణ నిర్ణయాలు తీసుకోవడం పక్షులకు చాలా అవసరం. కళ్లతో దృశ్యాన్ని చూసి క్షణాల వ్యవధిలో కచ్చితమైన విన్యాసాలు చేసే నైపుణ్యం వాటి పరిణామ క్రమంలో అలవాటైంది. అయితే, వాటి మెదడు మానవుల కంటే ఇంత వేగంగా ఎలా పనిచేస్తుందనే దానిపై భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేయనున్నట్లు నిపుణులు వెల్లడించారు.














Click it and Unblock the Notifications
