పాక్ ప్రధాని బిస్కెట్ వేసినా పడని నోబెల్ కమిటీ.. భంగపడ్డ డొనాల్డ్ ట్రంప్!
నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేపింది. నోబెల్ శాంతి బహుమతి 2026 ప్రకటనకు కొద్ది గంటల ముందు పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ దేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ పురస్కారానికి నామినేట్ చేసిందని.. ఈ సారి ఆయనకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నార్వే నోబెల్ కమిటీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ చీఫ్, 85 ఏళ్ల దక్షిణాఫ్రికా మూలాలున్న న్యాయకోవిదురాలు నవనేతం నవీ పిళ్లైని నోబెల్ శాంతి బహుమతి విజేతగా ప్రకటించింది. భారతీయ తమిళ నేపథ్యం ఉన్న నవీ పిళ్లై.. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న అనంతరం సభలో నవ్వులు పూయిస్తూ.. "మీరు ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడితే ఈ బహుమతిని ట్రంప్ తో పంచుకోవాల్సి వస్తుంది" అని చమత్కరించడం గమనార్హం.
మధ్యవర్తిత్వంపై పాక్ ప్రచారం.. ఖండించిన భారత్
మే 2025లో కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారత్ "ఆపరేషన్ సింధూర్" చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన సైనిక ఉద్రిక్తతలను తగ్గించడంలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని.. ఆయన చొరవతోనే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమైందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. అయితే పాక్ ప్రధాని వాదనను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం కుదిరిన ఒప్పందంలో ఏ మూడో దేశ ప్రమేయం లేదా మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ స్వయంగా విజ్ఞప్తి చేయడం వల్లే ద్వైపాక్షికంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) స్థాయిలో చర్చలు జరిపి కాల్పుల విరమణకు అంగీకరించామని వెల్లడించింది. భారత భూభాగంపై లేదా అంతర్గత విషయాల్లో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని ఎప్పటికీ అంగీకరించబోమని ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్‌కు స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

మానవ హక్కుల పోరాటానికి దక్కిన గౌరవం
ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణకు, మానవ హక్కుల పరిరక్షణకు చేసిన కృషికి గాను నవీ పిళ్లైకి ఈ నోబెల్ బహుమతిని అందజేస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ఛైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ తెలిపారు. నెల్సన్ మండేలా వంటి మహోన్నత నాయకుల తరఫున న్యాయవాదిగా వ్యవహరించిన నవీ పిళ్లై.. ఆ తర్వాత అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం మాజీ న్యాయమూర్తిగా, యూఎన్ మానవ హక్కుల హైకమిషనర్‌గా సేవలందించారు. డిసెంబర్ 10న ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ఆమెకు 1.2 మిలియన్ డాలర్ల నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఒకసారి ప్రకటించిన నోబెల్ బహుమతిని వేరొకరికి బదిలీ చేయడం కానీ, పంచుకోవడం కానీ సాధ్యపడదని కమిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది ట్రంప్ పేరును పాకిస్తాన్, ఇజ్రాయెల్, కాంబోడియా దేశాలు ప్రతిపాదించినప్పటికీ నోబెల్ కమిటీ నవీ పిళ్లై వైపే మొగ్గు చూపింది.
Amazing moment. Navi Pillay has received the Nobel Peace Prize ! https://t.co/HL3r1PJzLOWe are at the Nuremberg Court; I cannot think of a stronger symbol for her Nobel prize. We are all so thrilled! This is her first reactions upon hearing the news: https://t.co/Crbj6XdiyQ
— Agnes Callamard (@AgnesCallamard) October 9, 2026














Click it and Unblock the Notifications
