ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ టాయిలెట్ల్స్.. ఎక్కడున్నాయో తెలుసా?
రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే క్రమంలో నోరుజారడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కొత్తేమీ కాదు. గతంలో అభివృద్ధి చెందని కొన్ని దేశాలను ఉద్దేశించి ఆయన చేసిన "షిట్‌హౌస్ కంట్రీస్"అనే వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారాన్ని నార్వే దేశ అధికారిక పర్యాటక శాఖ అత్యంత చాకచక్యంగా తమకు అనుకూలంగా మలుచుకుంది. ట్రంప్ వాడిన అభ్యంతరకర పదాన్నే అస్త్రంగా చేసుకుని, ఆయనకు దిమ్మతిరిగే రీతిలో వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
నార్వే అందమైన టాయిలెట్లు.. ట్రంప్‌కు ఘాటు సమాధానం!
నార్వే టూరిజం బోర్డు తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా దేశంలోని రమణీయమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉన్న వాష్‌రూమ్‌ల ఫొటోలను పంచుకుంది. "ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన, అందమైన వాష్‌రూమ్‌లు మా దేశంలోనే ఉన్నాయి" అంటూ ఓ సరదా క్యాప్షన్‌ను జోడించింది. ట్రంప్ వ్యాఖ్యానించిన "షిట్‌హౌస్" అనే పదాన్ని కొట్టివేస్తూ.. "అత్యంత అందమైన లేట్రిన్ హౌస్‌లు" అంటూ నార్వే చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమర్శను కూడా తమ పర్యాటక ప్రచారానికి ఉపయోగించుకున్న నార్వే ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వివాదానికి మూలం ఏంటి?
ఇటీవల జార్జియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో డెమోక్రటిక్ సెనేటర్‌పై విమర్శలు గుప్పించే క్రమంలో ట్రంప్ పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. లిబియా, యెమెన్, హైతీ, సోమాలియా వంటి దేశాల నుంచి వచ్చే వలసదారులను అనుమతించడంపై అసహనం వ్యక్తం చేస్తూ, వారిని ఆ రకమైన పదజాలంతో సంబోధించారు. అదే సమయంలో నార్వే, స్వీడన్, డెన్మార్క్ వంటి అభివృద్ధి చెందిన ఐరోపా దేశాల నుంచి ప్రజలను ఎందుకు వలసలుగా తీసుకోకూడదని ప్రశ్నించారు.
ప్రచారంలో భాగంగా పాత కామెంట్లు
అమెరికాలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ట్రంప్, వలసదారుల విధానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డెమోక్రాట్లు తీసుకొస్తున్న చట్టాల వల్ల సురక్షితం కాని దేశాల నుంచి ప్రజలు అమెరికాకు వస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితం మూసిఉన్న గదిలో డెమోక్రాట్ నేతలతో జరిగిన భేటీలో తాను అన్న మాటలను ఆయనే స్వయంగా మళ్లీ ప్రస్తావించడంతో ఈ వివాదం మరోసారి రాజకీయాన్ని వేడెక్కించింది.
తిప్పికొట్టిన నార్వే వ్యూహం
ట్రంప్ పదే పదే తమ దేశం పేరును ఉదాహరణగా వాడుకోవడంపై నార్వే స్పందిస్తూ, ఆయన మాటల్లోని నెగెటివిటీని పాజిటివ్‌గా మార్చేసింది. ప్రకృతి ఒడిలో నిర్మించిన తమ పబ్లిక్ వాష్‌రూమ్‌ల చిత్రాలను ప్రపంచానికి చూపిస్తూ.. పర్యాటకులను ఆకర్షించే సరికొత్త ప్రచారానికి తెరలేపింది. మొత్తానికి రాజకీయ వేడి మధ్య నార్వే పర్యాటక శాఖ వేసిన ఈ సెటైరికల్ పంచ్ అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.














Click it and Unblock the Notifications
