భారత్‌తో ఆటలొద్దు: పుతిన్ వార్నింగ్, మోడీపై ప్రశంసలు
మాస్కో/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ అనుసరిస్తోన్న విధానం ఎంతో ఉన్నతంగా ఉందన్నారు. ఇలా పాటించడం నేటి ప్రపంచంలో అంత సులభం కాదని కితాబిచ్చారు. ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయటనుంచి ఆటలు ఆడే ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.
రష్యన్ స్టూడెంట్ డే సందర్భంగా కాలినింగ్రాండ్ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించిన పుతిన్.. ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. స్వతంత్ర విదేశీ విధానాన్ని భారత్ అనుసరిస్తోంది. నేటి ప్రపంచంలో అది అంత తేలిక కాదు. సుమారు 150 కోట్ల జనాభా కలిగిన భారత్‌కు ఆ హక్కు ఉంది అని పుతిన్ వ్యాఖ్యానించారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్ ఒకటని పుతిన్ పేర్కొన్నారు. అది కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వల్లే సాధ్యమైందన్నారు. మోడీ సారథ్యంలోనే భారత్ ఇంటి వేగం పుంజుకుందన్నారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోడీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యమని పుతిన్ స్పష్టం చేశారు. అంతేగాక, ఈ క్రమంలోనే భారత్, ఆ దేశ నాయకత్వంపై రష్యా ఆధారపడవచ్చని పేర్కొన్నారు.
భారత్‌లో రాజకీయ పలుకుబడి కోసం ఆటలాడవద్దని బయటి శక్తులను పుతిన్ హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు. మరోవైపు, భారత్‌కు గొప్ప సంస్కృతి ఉందన్నారు. జాతీయ టీవీ ఛానెళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటి తెలిపారు. ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదన్నారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదలైన మేకిన్ ఇండియా కార్యక్రమం రష్యా తోపాటు ఎన్నో దేశాలు చూస్తున్నాయన్నారు. ఆ ప్రణాళికలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు భారత భాగస్వాములతో కలిసి ప్రయత్నిస్తున్నామని పుతిన్ వివరించారు. భారత్ కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా రష్యా నుంచే వస్తున్నాయని తెలిపారు. భారత్‌లో రష్యా పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు.












Click it and Unblock the Notifications