ఇబ్బంది పెట్టాను: నవ దంపతులను క్షమాపణ కోరిన ఒబామా
హొనలులు: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ నవ దంపతులకు క్షమాపణ చెప్పారు. మీకు అసౌకర్యం కలిగించినందుకు క్షమించాలని వారిని ఆయన కోరారు. వివరాల్లోకి వెళితే.. బరాక్ ఒబామా గోల్ఫ్ ఆట ఆడేందుకు కోసం.. ఓ నవ దంపతులు ఉన్నపళంగా వారి వివాహ వేదిక మార్చుకోవాల్సి పరిస్థితి వచ్చింది.
అమెరికా ఆర్మీ కెప్టెన్లు అయిన నటాలియా హీమెల్, ఎడ్వర్డ్ మాల్యూ జూనియర్ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. హవాయ్‌లో ఆర్మీకి చెందిన క్యానెయుహె క్లిప్పర్ గోల్ఫ్ కోర్సులో వివాహ వేదికను నిశ్చయించారు. శనివారం వివాహ వేదిక వద్ద రిహార్సల్స్ చేశారు.

అయితే, అధ్యక్షుడు ఒబామా సెలవుల్లో గడిపే నివాసం ఈ గోల్ఫ్ కోర్సుకు సమీపంలో ఉండటం.. ఆదివారం ఆయన స్నేహితులతో గోల్ఫ్ ఆడాలని నిర్ణయించడంతో.. ఉన్నపళంగా వివాహ వేదికను 16వ గోల్ఫ్ హోల్ అవతలకు మార్చుకోవాలని నవ దంపతులకు అధికారులు హుకుం జారీశారు.
దీంతో చేసేదేమి లేక ఆదివారం సముద్రం అందాలను ఆస్వాదిస్తూ వివాహం చేసుకోవాలనుకున్న నటాలియా, మాల్యూ అప్పటికప్పుడు నానా తంటాలు పడి వేదిక మార్చుకున్నారు.
అంతా అయిపోయిన తర్వాత తనవల్ల అవస్థలు పడ్డారని తెలుసుకున్న ఒబామా.. నవదంపతులకు ఫోన్‌చేసి క్షమాపణలు చెప్పారు. అంతేగాక వారికి వివాహ శుభాకాంక్షలు కూడా తెలిపారు. అమెరికా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడంతోపాటు శుభాకాంక్షలు తెలుపడంతో ఆ నవ దంపతులు వివాహ వేదిక మార్పుకు పడిన ఇబ్బందులను మర్చిపోయి ఆనందం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications