ట్రంప్ చాల ప్రమాదకారి జాగ్రత్త: ఒబామా
వాషింగ్టన్: అమెరికా ప్రజాస్వామ్య పరిరక్షణ మీ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చాల ప్రమాదకారి అని ఒబామా అమెరికన్లను హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ఒబామా మరో సారి ట్రంప్ మీద విరుచుకుపడ్డారు. ట్రంప్ ను ఎన్నుకుంటే ప్రపంచం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అమెరికన్ పౌర హక్కులకు ట్రంప్ ప్రమాదకారి అని ఆరోపించారు.

నార్త్ కరొలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఒబామా ప్రసంగించారు. కరొలినాలో ఓటర్లు సరిగ్గానే వ్యవహరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో లేనని, అయితే ఓటు వేసే ముందు ఓటర్లు బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని మనవి చేశారు.
బ్యాలెట్ పేపర్ అంటే ప్రజాస్వామ్యం, అభివృద్ది, న్యాయం అని ఒబామా అన్నారు. ట్రంప్ లాంటి ప్రమాదకారిని వైట్ హౌస్ కు రాకుండా అడ్డుకోవాలంటే అది మీ ఓటుతోనే సాధ్యం అవుతుందని గుర్తు చేశారు.
గత ఎనిమిదేళ్లు అమెరికా సాధించిన అభివృద్ది ఇక ముందు కొనసాగాలంటే హిల్లరీ క్లింటన్ ను గెలిపించాలని మనవి చేశారు. దేశం కోసం హిల్లరీ చాల కష్టపడుతారని ఒబామా చెప్పారు. అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీనే సరైన అభ్యర్థి అని గుర్తు చేశారు.
ఇక్కడ గేలిస్తే దేశం మొత్తం గెలుపుసాధించినట్లేనని, మీరు చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోకూడదని స్థానిక ప్రజలకు సూచించారు. ఇదే సమయంలో ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఒబామా తప్పుబట్టారు.
ఈ-మెయిల్స్ వ్యవహారంలో హిల్లరీ క్లింటన్ మీద విచారణ చేస్తామని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పోలింగ్ కొద్ది రోజుల్లో జరుగుతుండగా జేమ్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబుకాదని ఒబామా అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొందరు ప్రకటించిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మి విచారణ చెయ్యడం సరికాదని ఒబామా అన్నారు. ఈ వివాదానికి సంబంధించి అసంపూర్తి సమాచారం మాత్రమే వీరి దగ్గర ఉందని, కేవలం దాన్ని ఆధారంగా తీసుకుని విచారణ చెయ్యడం సరికాదని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పారు.












Click it and Unblock the Notifications