పోలీసు కాల్పుల్లో బ్లాక్‌మ్యాన్ మృతి: అమెరికాలో ఉద్రిక్తత
వాషింగ్టన్: నల్ల జాతీయులకు, అమెరికా పోలీసులకు మధ్య ఉద్రిక్తతలను పెంచే మరో సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో నల్లజాతి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సెయింట్ లూయీస్ పట్టణ శివారులో జరిగింది.
దొంగతనం ఫిర్యాదు రావడంతో పోలీసు అధికారి గ్యాస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన కారు దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో పద్దెనిమిదేళ్ల నల్లజాతి యువకుడు అధికారి పైకి తుపాకీని ఎక్కు పెట్టాడు. దీంతో పోలీసు అధికారి తన సర్వీసు రివాల్వర్‌తో కాల్పులు జరిపారు.

ఈ కాల్పులలో ఆ యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు. మృతుడిని ఆంటోనియో మార్టిస్‌గా గుర్తించినట్లు చెబుతున్నారు. అతని పైన పలు దౌర్జన్యం, దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు అధికారులు చెబుతున్నారు.
ఈ సంఘటన తర్వాత దాదాపు 300 మంది ప్రదర్శనకారులు రాళ్లు, పేలుడు పదార్థాలతో వచ్చారు. పోలీసులు వారిని పెప్పర్ స్ప్రేతో చెదరగొట్టారు. కాల్పుల ఘటనకు సమీపంలోని దుకాణంలో ఓ గుంపు దోపిడీకి పాల్పడింది. ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. కాగా, తన కుమారుడు పరుగెత్తుతుంటే కాల్చివేశారని మృతుడి తల్లి చెబుతోంది.












Click it and Unblock the Notifications