అదే జరిగితే 'ఓపెన్ వార్' చేస్తాం.. పాక్ రక్షణ మంత్రి సంచలనం
అఫ్గానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఇస్తాంబుల్ లో జరుగుతున్న శాంతి చర్చలు విఫలం అయితే అఫ్గానిస్తాన్ తో ఓపెన్ వార్ ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి చర్చలకు తాలిబన్ ప్రభుత్వం అంగీకరిస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఇటీవల ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
అఫ్గానిస్తాన్- పాకిస్థాన్ మధ్య శాంతి చర్చలు అక్టోబర్ 25 శనివారం రోజున ప్రారంభం అయ్యాయి. ఆదివారం వరకూ చర్చలు సాగనున్నాయి. 2021 లో అఫ్గానిస్తాన్ ను తాలిబన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్థాన్- అఫ్గానిస్తాన్ మధ్య ఇటీవల సరిహద్దు వద్ద భారీగా దాడులు జరిగాయి. అయితే ఇరు దేశాలు శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు.
అయితే ఇదే విషయంపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మాట్లాడుతూ గత నాలుగైదు రోజులుగా ఇరు దేశాల సరిహద్దుల్లో ఎలాంటి కవ్వింపులు లేవని పేర్కొన్నారు. అయితే తమకు ఓ అవకాశం ఉందని.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలీకృతం కాకపోతే అఫ్గానిస్తాన్ తో ఓపెన్ వార్ ఉంటుందని హెచ్చరించారు. కానీ తాలిబన్ లు శాంతిని కోరుకుంటున్నారని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఇక ఇటీవల పాకిస్థాన్ - అఫ్గానిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం చెలరేగిన విషయం తెలిసిందే. అఫ్గాన్ లోని కొన్ని మిలిటెంట్ దళాలు పాకిస్థాన్ పై దాడులు చేస్తోందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ క్రమంలో అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ ను చేపట్టింది.

ఈ దాడుల్లో డజన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరు దేశాల మధ్య ఉన్న కీలకమైన మార్గాలను మూసివేశారు. పాకిస్థాన్ సైన్యంపై దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్స్ కు అఫ్గానిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని పాకిస్థాన్ వాదిస్తోంది. అయితే అఫ్గానిస్తాన్ మాత్రం.. పాకిస్థాన్ తమ సార్వభౌమాధికారానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని వాదిస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఇటీవల కాల్పుల విరమణ జరిగింది. ప్రస్తుతం శాంతి చర్చలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications