అంబానీ, అదానీ వ్యాపారాలే లక్ష్యం: పాక్ సైన్యం కొత్త వ్యూహం?
పాకిస్థానీ-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సాజిద్ తరార్‌కు సంబంధించి ఒక వీడియో క్లిప్ ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. అందులో ఆయన పాకిస్థానీ సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా తన వ్యూహాన్ని మార్చిందని, దానిలో భాగంగా భారత్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తలైన ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారి వ్యాపార కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు.
మారిన పాకిస్థాన్ సైన్యం వ్యూహం
సాజిద్ తరార్ ప్రకారం.. పాకిస్థానీ సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా వ్యూహాన్ని మార్చింది. ఈ మార్పు ప్రకారం.. సరిహద్దుల వద్ద చిన్నపాటి సైనిక చర్యలకు బదులుగా, భారత్‌కు తీవ్రమైన ఆర్థిక, మానవ నష్టాన్ని కలిగించడంపై దృష్టి పెడుతోంది. సాజిద్ తరార్ ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. సాజిద్ తరార్ అమెరికాలో ఓ ప్రముఖ వ్యక్తి కావడం, పాకిస్థానీ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని భావిస్తున్నందున, ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

'బిజినెస్ టుడే ' నివేదిక ప్రకారం.. అమెరికాలో ఉన్న సుమారు 120 మంది పాకిస్థానీయుల సమావేశంలో జనరల్ మునీర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ముకేష్ అంబానీకి చెందిన జామ్‌నగర్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాలలో ఒకటి. దానిపై దాడి జరిగితే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతుంది.
సాజిద్ తరార్, ముకేష్ అంబానీ గురించి
సాజిద్ తరార్ స్వతహాగా పాకిస్థాన్‌కు చెందినవారైనప్పటికీ.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు. 1980-90లలో అమెరికాకు వెళ్లిన సాజిద్ తరార్.. అక్కడ న్యాయశాస్త్రాన్ని అభ్యసించి, తరువాత ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాలలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన మాక్సిమస్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను గట్టిగా సమర్థిస్తారు.
ముకేష్ అంబానీ ఇండియాలోనే కాకుండా, ఆసియాలోనే అత్యంత సంపన్నులలో ఒకరు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆయన సుమారు 99 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 18వ అత్యంత ధనవంతుడు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా గుర్తింపు పొందింది. ఈ వ్యాపార సామ్రాజ్యం చమురు, రిఫైనరీ, ఇంధనంతో పాటు అనేక రంగాలలో విస్తరించి ఉంది. ఆయన జామ్‌నగర్ రిఫైనరీ రోజుకు 14 లక్షల బారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైంది. సాజిద్ తరార్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్, పాకిస్థాన్‌ల మధ్య దౌత్య సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ఇరు దేశాల ప్రభుత్వాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications