అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన పాక్.. భారత్ కు కొత్త టెన్షన్..!
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ లో భారత్ శక్తి సామర్థ్యాలను చూసి పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అయింది. పాకిస్థాన్ నుంచి డ్రోన్ లను భారత్ సమర్థవంతంగా నేలకూల్చింది. మన రక్షణ వ్యవస్థ సామర్థ్యం ఏంటో దాయాదికి అర్థమైంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత తన సైనిక సామర్థ్యాలను పెంచుకునే పనిలో పాకిస్థాన్ నిమగ్నమైంది. అందులో భాగంగానే రెండు నెలల క్రితం ఫతా-4 క్రూయిజ్ మిసైల్ ను పరీక్షించింది. ఇప్పుడు తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యాంటీ- షిప్ బాలిస్టిక్ మిసైల్ ను పరీక్షించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం వెల్లడించింది.
భారత్, అఫ్గానిస్తాన్ లతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధ సంపత్తిని పెంచుకునే పనిలో పడింది పాకిస్థాన్. ఇప్పటికే చైనా, టర్కీ నుంచి అనేక అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసింది. మరికొన్ని ఒప్పందం చేసుకుంది. ఇక పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో టర్కీ డ్రోన్ లు, చైనా ఆయుధ వ్యవస్థను భారత్ సమర్థవంతంగా ధ్వంసం చేసింది. పాకిస్థాన్ లోని పలు ఎయిర్ బేస్ లనూ నేలకూల్చింది. ఈ క్రమంలో తాజాగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది పాకిస్థాన్.
ఇటీవల ఫతా-4 క్రూయిజ్ మిసైల్ ను పరీక్షించింది పాకిస్థాన్. దాని రేంజ్ 700 కి. మీ. లుగా ఉంది. అయితే తాజాగా యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతం అయినట్లు పాకిస్థాన్ మిలిటరీ విభాగం వెల్లడించింది. భూమిపై అలాగే సముద్రంలోని లక్ష్యాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదించగలదని పేర్కొంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ మిసైల్ ను షిప్ నుంచి ప్రయోగించారు.

అయితే యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై పాకిస్థాన్ రాష్ట్రపతి అసిఫ్ అలీ జర్దారీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్మీ , నేవీ అధికారులకు అభినందనలు తెలిపారు. ఇక వరుసగా పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.












Click it and Unblock the Notifications