పాకిస్తాన్ పర్యటనకు ప్రధాని మోదీ?: ఆహ్వానం అందింది
PM Modi SCO Summit 2024: ప్రతిష్ఠాత్మక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అత్యున్నత భేటీని ఈ ఏడాది పాకిస్తాన్ నిర్వహించబోతోంది. దీనికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని ఇస్లామాబాద్.. ఈ సమ్మిట్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. అక్టోబర్ 15, 16 తేదీల్లో ఈ భేటీ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఎస్‌సీఓలో సభ్యత్వం ఉన్న దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు లేదా విదేశాంగ శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. భారత్, చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది.

ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా.. అబ్జర్వర్ స్టేట్స్ హోదాలో కొనసాగుతున్నాయి. ఆర్మేనియా, అజర్‌బైజాన్, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీలకు డైలాగ్ పార్ట్‌నర్‌షిప్ ఉంది ఇందులో. సభ్య దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనేది ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం.
గత ఏడాది ఎస్సీఓ భేటీని భారత్ నిర్వహించింది. గోవాలో ఈ సమావేశం ఏర్పాటైంది. అప్పట్లో ఈ ఎస్సీఓ సభ్య దేశాల సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి హాజరైన విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాల విరామం తరువాత పాకిస్తాన్‌కు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి లేదా మంత్రి భారత్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.
ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. అక్టోబర్‌లో ఎస్సీఓ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాటు సాగిస్తోంది. సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులకు ఆహ్వానాలను పంపిస్తోంది. ఈ క్రమంలో భారత్‌కూ ఆహ్వానం అందింది. ఎస్‌సీఓ భేటీకి హాజరు కావాలంటూ అధికారికంగా ఆహ్వానపత్రాలను పంపించింది.
ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జెహ్రా బలోచ్ వెల్లడించారు. ప్రధాని మోదీకి ఆహ్వానాన్ని పంపించినట్లు ఆమె తెలిపారు. ఈ సమ్మిట్‌కు హాజరవుతామని కొన్ని సభ్య దేశాలు ధృవీకరించాయని, భారత్ ఇంకా తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉందని అన్నారు.
ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. గత ఏడాది భారత్‌లో జరిగిన సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి హాజరైనందున, భాగస్వామ్య ధర్మాన్ని పాటించేలా కేంద్ర ప్రభుత్వం ఇందులో పాల్గొనడం దాదాపు ఖాయమైనట్టే. మోదీ వెళ్తారా? లేక విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను పంపిస్తారా? అనేది వేచిచూడాలి.












Click it and Unblock the Notifications