పాకిస్థాన్ లో కిలో గోధుమ పిండి ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
సాధారణంగా మన దగ్గర కిలో గోధుమ పిండి ధర ఎంత ఉంటుంది..? రూ. 50 నుంచి రూ. 60 ఉంటుంది. కానీ పొరుగు దేశమైన పాకిస్థాన్ లో మాత్రం కిలో గోధుమ పిండి ధర ఏకంగా రూ. 200 దాటింది. ఇక 20 కేజీల గోధుమ పిండి బ్యాగ్ అయితే రూ. 3,330 లకు పైనే ఉంది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ముడి చమురు, గ్యాస్ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి పాకిస్థాన్ సంక్షోభంలో ఉంది. ఇప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలకోసం సబ్సిడీ ధరకే గోధుమ పిండిని అందిస్తున్నా బహిరంగ మార్కెట్స్ లో మాత్రం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దాంతో పాకిస్థాన్ లోని సామాన్య ప్రజానీకానికి తిండి తిప్పలు తప్పడం లేదు.
పాకిస్థాన్ లోని పేషావర్ లో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడ 20 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ధర రూ. 3,300 కు పైనే ఉంది. పిండి ధరలు పెరగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఇలా ఆహార కొరతను సృష్టించారంటూ స్థానిక ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సీడీకి అందించిన గోధుమ పిండి ఇప్పుడు బహిరంగ మార్కెట్లలో మాయమైంది. దాంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 20 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ధర రూ. 3,120 ఉండగా.. 80 కిలోల గోధుమ పిండి బ్యాగ్ ధర రూ. 13,200 గా ఉంటుంది. అలాగే 20 కేజీల చోకర్ ధర రూ. 1,480 గా ఉంది. ధరలు సడెన్ గా పెరగడంతో గోధుమ పిండి రోజుల వ్యవధిలోనే డీలర్లు కోట్లు సంపాదించారని కథనాలు వెల్లడిస్తున్నాయి.

పేషావర్ ప్రాంతంలో కొంతమంది వ్యాపారులు కావాలనే ఇలా పిండి కొరతను సృష్టించారని స్థానిక ప్రజలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దాంతో లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రముఖ డీలర్లు, పిండి వేర్ హౌజ్ లపై దాడులు చేపట్టారు. మరోవైపు బేకరీ యజమానులు కూడా బేకరీ ఉత్పత్తుల ధరలను పెంచారు. 50 గ్రాముల రోటీ ధర ప్రస్తుతం ఉన్న రూ. 20 నుంచి రూ. 30 కు పెంచారు. ఖైబర్ బజార్, అష్రఫ్ రోడ్, కరాచీ మార్కెట్, నమక్ మండీ, గవర్న్ మెంట్ కాలేజీ చౌక్ ప్రాంతాల్లో సింగిల్ రోటీలను అమ్మడం ఆపేశారు. రూ. 40 కు డబుల్ రోటీలు తీసుకోవాలని సూచించారు. అయితే రోటీల నాణ్యత దారుణంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణాలపై పేషావర్ అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క పేషావర్ లోనే కాదు పాకిస్థాన్ లోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిత్యావసరాల ధరలను కూడా కంట్రోల్ చేయడంలో పాక్ ప్రభుత్వం విఫలం కావడంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications
