పాకిస్థాన్ హీరో: బాంబర్‌ను అడ్డుకుని ప్రాణత్యాగం
ఇస్లామాబాద్: తన స్నేహితులను కాపాడాలనుకున్న ఓ పాకిస్థానీ బాలుడు, అందుకు తన ప్రాణాలనే త్యాగం చేశాడు. తను చదువుకుంటున్న పాఠశాల మొత్తాన్ని పేల్చేసేందుకు వచ్చిన ఓ ఆత్మాహుతి బాంబర్‌ను అడ్డుకోవడానికి తన ప్రాణాలనే అర్పించాడు. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పాకిస్థాన్‌లోని హంగు జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐతెజాజ్ హసన్ (15) అనే బాలుడు పాఠశాలను పేల్చేసేందుకు వచ్చిన ఆత్మాహుతి బాంబర్‌ను అడ్డుకున్నాడు. దీంతో అతడు అక్కడిక్కడే బాంబు పేల్చేసుకోవడంతో ఐతెజాజ్ హసన్ తన ప్రాణాలను కోల్పోయాడు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా... పాఠశాల గేటు నుంచి బాంబర్‌ను లోపలికి రాకుండా అడ్డుకున్న ఐతెజాజ్, వందలాది మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు.

ప్రాణాలు తెగించి వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఆ బాలుడి త్యాగాన్ని అక్కడి మీడియాతోపాటు ప్రపంచ మీడియా కూడా అతనిపై ప్రశంసలు కురిపించింది. ఐతెజాజ్‌ను పాకిస్థాన్ హీరోగా అభివర్ణించాయి.
సామాన్యులు చూపించే ఇలాంటి ధైర్యం అందరికీ స్ఫూర్తినిస్తుందని, ఉగ్రవాదులపై పోరాడేందుకు ధైర్యం ఇస్తుందని డాన్ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. గతంలో తెహరిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కొన్న మలాలా యూసఫ్‌జాయ్ ఉదంతాన్ని కూడా ఆ పత్రిక ప్రస్తావించింది. అసమాన ధైర్య సాహసాలు చూపించిన ఐతెజాజ్, తన ప్రాణాలను అర్పించాడని పేర్కొంది.












Click it and Unblock the Notifications