పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి, 30 మందికి సీరియస్
పశ్చిమాసియాలో ఉద్రికత్తల కారణంగా ఆ ప్రభావం పాకిస్థాన్ పై పడి అక్కడి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారింది. ఈ క్రమంలో పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మంగళవారం ఉదయం ఈ రైలు ప్రమాదం జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఓ ప్యాసింజర్ రైలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. దాంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ నుంచి పెషావర్ వెళ్తున్న రెహమాన్ బాబా ప్యాసింజర్ రైలు మంగళవారం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, రైల్వే సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని చికిత్స కోసం ముల్తాన్ లోని నిష్తర్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ ఆరుగురు మరణించారు. అలాగే దాదాపు 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాల్ని స్థానిక పోలీసులు ధృవీకరించారు. ప్యాసింజర్ రైలు వంతెన సమీపానికి రాగానే మొత్తం 14 కోచ్ లు పట్టాలు తప్పాయని తెలిపారు. ఇక ప్రమాద స్థలంలో సహాయక బృందాలు తమ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని పోలీసులు, సహాయక అధికారులు చెప్పినట్లు పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ న్యూస్ ఛానెల్ జియో న్యూస్ వెల్లడించింది.

ఇక ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ప్రమాద స్థలంలో సహాయక, రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు. అటు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. రైలు ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications
