ఆరు రాష్ట్రాలుగా కాలిఫోర్నియా!: సంతకాల సేకరణ
న్యూయార్క్: సిలికాన్ వెంచర్ క్యాపిటలిస్ట్ టిమ్ డ్రాపర్ ఒక పెద్ద ఆలోచనలో ఉన్నారు. అమెరికాలోనే అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియా రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఆరు రాష్ట్రాలుగా విభజించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకోసం ఆయన బ్యాలెట్ ద్వారా సంతకాలను సేకరించే పనిలో ఉన్నారు.
ఇంత పెద్ద రాష్ట్రానికి ఒకే ఒక ప్రభుత్వ ప్రతినిధి సమర్థవంతమైన పాలన అందించలేరని, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాలన సరిగా లేదని ఆయన తెలిపారు. రాష్ట్రాల ఏర్పాటు కోసం తాను సంతకాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఆరు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడటం వల్ల కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వం నుంచి మంచి పాలనను అందిపుచ్చుకోగలరని గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో టిమ్ డ్రాపర్ పేర్కొన్నారు.

పెద్ద రాష్ట్రంగా ఉండటం వలన పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన తెలిపారు. చాలా ప్రభుత్వ పాఠశాలలకు, రవాణా వ్యవస్థకు, నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా పలు సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని టిమ్ డ్రాపర్ పేర్కొన్నారు. అందువల్ల ఇదంతా ఓ జైలులో ఉన్నట్లుగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఒకరికొకరు సహకరించుకుని అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు.
కాలిఫోర్నియాలో ప్రస్తుతం 38 మిలియన్ల మంది ప్రజలు జీవిస్తున్నారని, ఆరు రాష్ట్రాలుగా విభజించడం వల్ల ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 1850లో ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే మూడు లేదా నాలుగు రాష్ట్రాలు చేయాలని డిమాండ్లు కొనసాగుతుండటం గమనార్హం. కాగా లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా పాత్ బ్రౌన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్ ఎగ్జిక్యూటివ్ రాఫెల్ సోనెన్షేన్ మాట్లాడుతూ.. విభజన వల్ల పెద్ద ప్రయోజన ఏమి ఉండదని, ఇదో హాస్యాస్పద ప్రతిపాదన అని అన్నారు.
ఇది ఇలా ఉండగా కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ఆరు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ టిమ్ డ్రాపర్ రాష్ట్ర కార్యదర్శి కార్యాలయంలో అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించారు. ప్రస్తుత కాలిఫోర్నియాను శానిఫ్రాన్సిస్కోతో కలిప సిలికాన్ వ్యాలీగా ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రం పశ్చిమ కాలిఫోర్నియాలో లాస్ ఏంజెల్స్, శాంతా బర్బారా, వెంచురా భాగం కావాలని, హార్ట్‌లాండ్ సెంట్రల్ కాలిఫోర్నియాగా ఉండనుందని, శాన్ డియాగో దక్షిణ కాలిఫోర్నియాలో పెద్ద పట్టణంగా ఉండనుందని డ్రాపర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications