మరో ఘోర విమాన ప్రమాదం.. 15 మంది మృతి, 30 మందికి గాయాలు !!
కొత్త కరెన్సీ నోట్లు తరలిస్తున్న వైమానిక దళానికి చెందిన విమానం ప్రమాదానికి గురై 15 మందికి బలి తీసుకుంది. ఈ దారుణ ఘటనలో మరో 30 మంది గాయపడినట్టు తెలుస్తుంది. ఈ దుర్ఘటనతో బొలీవియా లోని El Alto నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ తప్పి రన్‌వేను దాటి సమీప హైవేపైకి దూసుకెళ్లింది. ఈ వ్యవహారం సర్వత్రా తీవ్ర విషాదం నింపుతుంది.
ప్రతికూల వాతావరణం కారణమా?
కాగా శాంటాక్రూజ్ నుంచి బయలుదేరిన ఈ విమానం El Alto International Airport లో ల్యాండ్ అవుతుండగా భారీ గాలులు, తక్కువ విజిబిలిటీ వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయని సమాచారం. రన్‌వేపై జారిన విమానం వేగాన్ని నియంత్రించలేక చివరకు రహదారిపైకి దూసుకెళ్లింది. అక్కడి రద్దీ ట్రాఫిక్‌లో ప్రయాణిస్తున్న వాహనాలను ఢీకొనడంతో నష్టం మరింత పెరిగింది.

ప్రమాదం కారణంగా మృత్యువాత పడిన వారిలో విమాన సిబ్బందితో పాటు రోడ్డుపై వెళ్తున్న పౌరులు కూడా ఉన్నారని అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. సమీప ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. ప్రమాదం తర్వాత విమానం అవశేషాల మధ్య చెల్లాచెదురుగా పడిన కరెన్సీ నోట్లు కనిపించాయి. భద్రతా సిబ్బంది వాటిని సేకరించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
సోషల్ మీడియాలో వైరల్..
అయితే ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. రహదారిపై పడిపోయిన కరెన్సీ నోట్లను కొందరు సేకరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రమాద స్థలాన్ని పూర్తిగా మూసివేసి ప్రజలను దూరంగా ఉంచారు. విమాన ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక లోపమా, వాతావరణ ప్రభావమా, లేక మానవ తప్పిదమా అన్న కోణాల్లో విచారణ సాగనుంది. విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి భద్రతా తనిఖీలు చేపట్టారు.
ఈ ఘటనతో విమాన భద్రతా ప్రమాణాలపై చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యంగా నగర ప్రాంతాలకు సమీపంలో ఉన్న విమానాశ్రయాల్లో అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications