పాకిస్థాన్ రాజకీయ సంక్షోభం కొత్త మలుపు.. సుప్రీం కోర్టుకు చేరిన ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం..!!
పాకిస్థాన్ రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవి గండం తప్పదనుకున్న సమయంలో ప్రతిపక్షాలకు షాక్ తగిలింది. ఇమ్రాన్‌కు ఊరట లభించింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసీం తోసిపుచ్చారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. జాతీయ అసెంబ్లీని ఈనెల 25కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫారసు మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు పాక్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ ప్రకటించారు. 90 రోజుల్లో ఎన్నికలు జరిగేలా నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి ఆపద్దర్మ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ కొనసాగనున్నారు.
అయితే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని .. తీర్మానంపై ఓటింగ్ కు అనుమతించలేదని మండిపడ్డాయి. తామంతా ఏకతాటిపై ఉన్నామని , జాతీయ అసెంబ్లీని వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. అవిశ్వాస తీర్మానం తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. పాకిస్టాన్ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉదన్నారు. ఇందు కోసం అన్ని వ్యవస్థలను ఆశ్రయిస్తామని తెలిపాయి.

మరోవైపు అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంపై పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిని సుమోటాగా విచారణకు తీసుకుంది. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తు పాకిస్థాన్ సుప్రీం కోర్టులో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇవ్వనుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె దించగలమన్న విశ్వాసంతో ఉన్న తమకు .. డిప్యూటీ స్పీకర్ చర్యలు షాక్‌కు గురిచేశాయని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావత్ భుట్టో జర్దారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తాము విడిచిపెట్టేది లేదని దుయ్యబట్టారు. విపక్షాలన్నీ ఒక్కతాటిపై ఉన్నాయని జర్ధారీ తేల్చిచెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఇమ్రాన్‌పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని చెప్పుకొచ్చారు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications