బైడెన్ భార్యకు మోడీ కాస్ట్ లీ డైమండ్ గిఫ్ట్- ఎంత ఖరీదైందో తెలిస్తే షాక్..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) భార్య, అమెరికా ప్రథమ మహిళ అయిన జిల్ బైడెన్ (jill biden) కు భారత ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) అత్యంత ఖరీదైన కానుక ఇచ్చారు. రెండేళ్ల క్రితం అమెరికా పర్యటనలో ఆమెకు ఈ కానుక ఇచ్చారు. అది కాస్తా ఇప్పుడు బైడెన్ అధికార పీఠం దిగిపోయే సమయంలో బయటపడింది. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. అలాగే భారత్ లోనూ బైడెన్ భార్యకు ప్రధాని మోడీ ఇంత విలువైన కానుక ఇవ్వడం ఏంటనే చర్చ సాగుతోంది.

భారత్-అమెరికా మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. వాణిజ్య పరంగా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూనే ఉంటారు. అలాగే అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ ఇరు దేశాల మైత్రి కొనసాగుతోంది. అందుకే అమెరికాకు అధ్యక్షులు మారుతున్నా భారత్ తో సంబంధాలు మాత్రం అలాగే ఉన్నాయి. అలాగే అమెరికా అధ్యక్షులుగా ఉన్న వారితో పాటు వారి సతీమణులు, ప్రథమ మహిళలుగా ఉన్న వారికి కూడా తమ పదవీకాలంలో దేశ విదేశాల నుంచి ఎన్నో బహుమతులు అందుతూనే ఉంటాయి. కానీ ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ .. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం అత్యంత ఖరీదైనది.
దాదాపు 20 వేల అమెరికా డాలర్ల విలువైన డైమండ్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ.. 2023లో అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు సతీమణి అయిన జిల్ బైడెన్ కు కానుకగా సమర్పించుకున్నారు. 7.5 క్యారెట్ల ఈ డైమండ్ ను ప్రధాని మోడీ జిల్ బైడెన్ కు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా 17 లక్షల 15 వేలు. 2023లో అమెరికా అధ్యక్ష దంపతులకు లభించిన అన్ని బహుమతుల్లోకెల్లా ఇదే అత్యంత ఖరీదైనది. అలాగే అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి నుంచి ఆమెకు ఓ బ్రూచ్ (బట్టలకు పెట్టుకునే పిన్ ) కూడా బహుమతిగా అందినట్లు తెలిసింది. దీని విలువ 14 వేల అమెరికా డాలర్లు ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.












Click it and Unblock the Notifications