పుతిన్‌కు మోదీ, జిన్‌పింగ్ ఆఫర్.. ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. ఈ ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికేందుకు సాయం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముందుకొచ్చారు. తాజాగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం వేదికగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
శాంతి చర్చలకు రష్యా స్వాగతం
ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఉక్రెయిన్ వివాదాన్ని చల్లార్చేందుకు భారత్, చైనాలు ఉమ్మడిగా లేదా ప్రత్యేకంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని రష్యా వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీరి ప్రతిపాదనను స్వాగతించారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన ప్రయత్నాలు ఫలించని తరుణంలో మోదీ- జిన్‌పింగ్‌ల చొరవకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఒకే వేదికపై 'శక్తి త్రయం'
బ్రిక్స్ వేదికపై ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్‌ల కలయికను 'శక్తి త్రయం' గా విశ్లేషకులు అభివర్ణించారు. సదస్సు ప్రారంభంలో ఈ ముగ్గురు నాయకులు ఎంతో ఆప్యాయంగా చేతులు పట్టుకుని నవ్వుతూ కనిపించిన దృశ్యాలు గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుత ప్రపంచంలోని విభేదాల నడుమ బలమైన దౌత్య సమతుల్యతను, ఐక్యతను ఈ దృశ్యం చాటిచెప్పింది.
కీలక సమయంలో భారత్ ప్రాధాన్యత
రష్యా రాజకీయాల్లో కూడా ఈ సమయం ఎంతో కీలకమైనది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా తన మొదటి పార్లమెంటరీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మరోవైపు అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లు మాస్కో, కీవ్‌లలో పర్యటించి దౌత్య ప్రయత్నాలు చేసినా అవి కొలిక్కి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్కో, టెహ్రాన్, పశ్చిమ దేశాలతో ఒకేసారి మాట్లాడగలిగే విశిష్టమైన దౌత్య సామర్థ్యం ఇండియాకు మాత్రమే ఉందనే అభిప్రాయం అంతర్జాతీయ వేదికలపై వ్యక్తం అవుతోంది.
శాంతి దిశగా భారత్ వైఖరి
వివాదాలను పరిష్కరించేందుకు యుద్ధం సరైన మార్గం కాదని.. చర్చలు, దౌత్యమే సరైన పరిష్కారమని ప్రధాని మోదీ పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమస్య శాంతియుత మార్గంలో పరిష్కారం కావాలనే భారత వైఖరి తమ విధానంతో ఏకీభవిస్తోందని రష్యా భావిస్తోంది. వారాంతంలో జరిగిన ఈ భేటీలు, భవిష్యత్తులో డిసెంబరులో జరిగే జీ20 సదస్సులో పుతిన్, జెలెన్స్కీల మధ్య ముఖాముఖి చర్చలకు వేదికగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు.














Click it and Unblock the Notifications
