ప్రధాని మోదీకి సడెన్ గా ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని.. కారణం ఇదే..!
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని కోరారు. ఇటీవల ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో దాదాపు 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత ఫైలట్ స్మిత్ మచ్చర్ తో కలిసి ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రారంభించాలని ఆయన కోరారు.
ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన అనంతరం నెతన్యాహు సామాజిక మాధ్యమం అయిన ఎక్స్ వేదికగా ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఇక ఇండిపెండెన్స్ డే వేడుకలకు తనను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారని.. అలాగే ఇరు దేశాలు కౌంటర్ టెర్రరిజంపై కలిసి కట్టుగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారని నెతన్యాహు వివరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన, చిరకాల సంబంధాలను మోదీ ప్రశంసించినట్లు తెలిపారు.
" నేను నా స్నేహితుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కెప్టెన్ స్మిత్ మచ్చర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన వెలిగించాలని కోరాను. నా ఆహ్వానంపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నేలపై.. ఆకాశంపైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరు దేశాలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న బలమైన సంబంధాలను ప్రధాని మోదీ కొనియాడారు" అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇక ఇదే విషయంపై ప్రధాని మోదీ పలు విషయాలను వెల్లడించారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత దృఢంగా మారేందుకు తగిన తోడ్పాటు అందించాలని నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే వీలైనంత త్వరగా పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు అవసరమైన అంశాలపైన చర్చించినట్లు స్పష్టం చేశారు. వీటితోపాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పరస్పర సహకారం, భద్రతా అంశాలపై సమన్వయంపై మాట్లాడినట్లు తెలిపారు.

మరోవైపు సెప్టెంబర్ 30 న ఫ్లై దుబాయ్ విమాన ప్రమాదం ఘటనలో భారత పైలట్ స్మిత్ మచ్చర్ తోటి పైలట్ చేతిలో తీవ్రంగా గాయపడినా ప్రాణాలకు తెగించి విమానంలోని దాదాపు 180 మంది ప్రయాణికులకు కాపాడారు. ఇక స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలు, తెగువపై భారత, ఇజ్రాయెల్ ప్రధానులు ప్రశంసలు కురిపించారు. అంతేకాక స్మిత్ మచ్చర్ ను ఇజ్రాయెల్ అత్యున్నత పౌర శౌర్య పురస్కారంతో సత్కరించనుంది. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం' కు ఆయన్ను ఎంపిక చేసినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
