ఉక్రెయిన్‌లో నెత్తుటి నదులు పారుతున్నాయన్న పోప్.. యుద్ధానికి ముగింపు టైం చెప్పిన పుతిన్ !!
ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ప్రధాన నగరాలను యుద్ధ ట్యాంకర్లతో చుట్టుముట్టింది. జనావాస ప్రాంతాలను టార్గెట్ చేసుకుని బాంబులతో దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్‌లో ఎటు చూసినా భయానకపరిస్థితులే కన్పిస్తున్నాయి. రోడ్లపై శవాలు పేర్చినట్లు కన్పిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అపార్ట్ మెంట్లు దంసమైయ్యాయి. భారీగా నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా హృదయవిదారకంగా దృశ్యాలు కన్పిస్తున్నాయి.

నెత్తుటి, కన్నీటి నదులు
ఉక్రెయిన్ లో రష్యా భీకర దాడులపై పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా స్పందించారు. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో నెత్తుటి, కన్నీటి నదులు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా చేపడులున్న ఇది కేవలం సైనిక చర్య కాదన్నారు. మరణం , విధ్వంసం దు:ఖాన్ని నాటుతోన్న యుద్ధమని విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో శరణార్థుల కోసం మానవతా కారిడార్ ను ఏర్పాటు చేయాలని పోప్ డిమాండ్ చేశారు. ఇరు దేశాలు శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

మావవతా చట్టాలను ఉల్లంఘన
మరోవైపు ఉక్రెయిన్‌లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై కూడా రష్యా దాడులకు దిగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోగ్య కేంద్రాలపై దాడుల ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలైనట్లు డబ్యూహెచ్వో ధృవీకరించింది. ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ వర్కర్లపై దాడులు అంతర్జాతీయ మావవతా చట్టాలను ఉల్లంఘించినట్లేనని డబ్యూహెచ్ఓ పేర్కొంది. ఇలాంటి దురాక్రమణ చర్యలకు రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

డిమాండ్లకు అంగీకరిస్తేనే యుద్ధానికి ముగింపు
ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం జరుగుతున్న వేళ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మ్యాక్రాన్‌తో రష్యా అధ్యక్షుడు వీడివీడిగా ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై జరుపుతున్న దాడులపై చర్చించారు. నాటోలో చేరకపోవడం, గతంలో తాము చేసిన డిమాండ్లపై ఉక్రెయిన్ అంగీకరిస్తేనే సైనిక దాడులకు ఆపుతామని పుతిన్ వారి తేల్చిచెప్పారు. ఉక్రెయిన్ తమ బలగాలను సమీకరించుకునేందుకు శాంతి చర్చలను పొడిగిస్తూ పోతే సహించేది లేదని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక చర్చలు జరపాలని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. విదేశీ భాగస్వాములతోనైనా చర్చలు జరిపేందుకు రష్యా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పుతిన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications