'పవర్ షేర్": ఫోటోల్లాగే.. ఛార్జింగ్ ను షేర్ చేసుకోవచ్చు
లండన్ : స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచాన్ని ఆపరేట్ చేయడానికి ఓ రిమోట్ కంట్రోల్ చేతుల్లోకి వచ్చి పడినట్టయింది. బ్యాంక్ పేమెంట్స్, కరెంట్ బిల్స్, వగైరా ఏ అవసరాలైనా సరే కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనులు కానిచ్చేయచ్చు. ఇవి కాకుండా సోషల్ మీడియా అప్ డేట్స్, లైకుల కామెంట్ల గోల, ఫేస్ బుక్, వాట్సాప్ ఛాటింగులు ఎలాగు ఉండనే ఉన్నాయి.
ఇన్ని అవసరాలు స్మార్ట్ ఫోన్ తో ముడిపడి ఉన్న నేపథ్యంలో.. రోజురోజుకు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతుందే తప్పించి తగ్గడంలేదు. కాగా.. ఇప్పటిదాకా మొబైల్ సాంకేతిక ఎంత అభివృద్ది చెందినా, ఛార్జింగ్ ను షేర్ చేసుకునే అవకాశం మాత్రం ఏ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. అత్యవసర సమయాల్లోమొబైల్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇలా ఛార్జింగ్ ను షేర్ చేసుకునే సౌకర్యం ఉంటే బాగుండు అని అనిపించకమానదు.

ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న లండన్ పరిశోధకులు త్వరలో మొబైల్ ఛార్జింగ్ ను షేర్ చేసుకునే సౌకర్యాన్ని స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వైర్ లెస్ టెక్నాలజీతో ఈ పవర్ షేర్ కాన్సెప్ట్ ను అభివృద్ది చేస్తున్నారు. పవర్ షేక్ పేరిట ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ద్వారా ఒక మొబైల్ ఫోన్ నుంచి మరో మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ పాస్ అయ్యేలా ఈ టెక్నాలజీని రూపొందిస్తున్నారు.
కాగా.. ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, పక్క పక్కనే మొబైల్ ఫోన్లను ఉంచి పవర్ షేర్ చేసుకోవచ్చు. ఈ విధానంలో 12 సెకన్ల పాటు పవర్ ను షేర్ చేసుకుంటే, ఆ పవర్ ద్వారా ఒక నిముషం ఫోన్ కాల్ మాట్లాడుకునే సౌకర్యం ఏర్పడనుంది.












Click it and Unblock the Notifications