వణికిన రష్యా- తీరంలో అల్లకల్లోలం: 32 నిమిషాల్లో..
Russia Earthquake 2025: రష్యాలో మూడు భూకంపాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలో భూమి ప్రకోపించింది. ఆ దేశాన్ని వణికించింది. ఈ మూడు కూడా అత్యంత శక్తిమంతమైనవే. తీర ప్రాంతం కావడం, భూకంపాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు.
రష్యాలోని కమ్ చట్కా ప్రావిన్స్ రాజధాని పెట్రోపావ్లోవ్స్క్-కమ్ చట్‌స్కీ సమీపంలో భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:23 నిమిషాలకుఈ మూడు భూకంపాలు సంభవించాయి. వీటిలో ఒక భూకంపం తీవ్రత 7.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు. 32 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది.

మొదటి భూకంపం 5.0 తీవ్రతతో సంభవించింది. దీని తర్వాత 6.7 తీవ్రతతో భూమి ప్రకోపించింది. పెట్రోపావ్లోవ్స్క్-కమ్ చట్స్కీకి తూర్పు దిశగా 151 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 8.7 కిలోమీటర్ల లోతులో ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది.
ఆ వెంటనే రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది పెట్రోపావ్లోవ్స్క్-కమ్ చట్స్కీకి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. ఉపరితలం నుంచి 20 కిలోమీటర్ల లోతు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు భారీ భూకంపాల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని సమాచారం అందింది.
వీటి తీవ్రత నేపథ్యంలో పసిఫిక్ మహాసముద్రంలో భూకంప కేంద్రం నుండి 300 కిలోమీటర్ల పరిధిలో గల ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకరంగా గుర్తించారు. ప్రమాదకరమైన సునామీ సంభవించే అవకాశం ఉందని USGS హెచ్చరించింది. పెట్రోపావ్లోవ్స్క్-కమ్ చట్‌స్కీ రీజియన్ లో 1,60,000 కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు.
పెట్రోపావ్లోవ్స్క్-కమ్ చట్‌స్కీ.. రష్యా సరిహద్దుల్లో ఉంటుంది. జపాన్‌కు ఈశాన్యం, అలాస్కాకు పశ్చిమం దిశగా ఉంటుందీ తీర ప్రాంతం. పసిఫిక్ మహా సముద్ర తీర ఉందిక్కడ. కమ్ చట్ స్కీ ఓ ద్వీపకల్పం. పసిఫిక్, నార్త్ అమెరికా టెక్టోనిక్ ప్లేట్‌ల పరిధిలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది.
1900 సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో 8.3 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన ఏడు ప్రధాన భూకంపాలు సంభవించాయి. భూకంపాలకు హాట్ జోన్ గా పరిగణిస్తుంటారీ ప్రాంతాన్ని. అసాధారణ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తోండటమే దీనికి ప్రధాన కారణం.












Click it and Unblock the Notifications