అమెరికా వర్సెస్ డబ్ల్యూహెచ్ఓ: బాంబు పేల్చిన ట్రంప్: తప్పు పట్టిన ఐక్యరాజ్య సమితి
న్యూయార్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పై అమెరికా బాంబు పేల్చింది. కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఈ సమయంలో తమను కాదని చైనాకు అండగా ఉంటోందంటూ కొద్దిరోజుల కిందటే ఆరోపణలు చేసిన అమెరికా.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓకు నిధుల సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించిన వారం రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ట్రంప్.

ఏటా భారీగా నిధులు మంజూరు..
ప్రపంచ ఆరోగ్య సంస్థకు అన్ని దేశాల తరఫున నిధులు అందుతుంటాయి. ఇందులో అమెరికాదే అగ్రస్థానం. ప్రతి సంవత్సరమూ 400 నుంచి 500 మిలియన్ డాలర్ల నిధులను అమెరికా డబ్ల్యూహెచ్ఓకు అందజేస్తుంటుంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టబెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోవట్లేదంటూ అమెరికా ఇదివరకే ఆరోపణలు గుప్పించింది. ప్రపంచ దేశాలతో సంప్రదించకుండా చైనాతో కలిసి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఒంటెద్దు పోకడలను పోతుందని విమర్శనాస్త్రాలను సంధించింది.

హెచ్చరికలను నిజం చేసిన ట్రంప్..
తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ నిధులను నిలిపి వేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అన్ని దేశాలను సమదృష్టితో చూడాల్సిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందనేది ట్రంప్ ఆరోపణ. కరోనా కల్లోలం సృష్టిస్తోన్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థలో పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ ట్రంప్ మండిపడ్డారు. తమ దేశానికి ఉపయోగపడని విధంగా నిర్ణయాలను తీసుకోలేని సమయంలో తాము ఎందుకు ఆర్థిక సహకారాన్ని అందించాలని ప్రశ్నించారు.

చైనా వైపే మొగ్గు చూపుతోందనే ఆరోపణ
అమెరికా సహా అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ విధ్వంసం సృష్టిస్తోన్నప్పటికీ.. చైనా వైపే డబ్ల్యూహెచ్ఓ మొగ్గు చూపుతోందని ట్రంప్ విమర్శించారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఏటేటా అత్యధికంగా నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుసరిస్తోన్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు తమకు నచ్చట్లేదని ట్రంప్ కుండ బద్దలు కొట్టారు. తాము పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసినప్పటికీ.. ఉపయోగం లేదనే విషయం దీనితో స్పష్టమైందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపించాల్సిన నిధులను నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

తప్పు పట్టిన ఐరాస
డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి తప్పు పట్టింది. నిధులను నిలిపి వేయడానికి ఇది సరైన సమయం కాదని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గ్యుటెరాస్ అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా తీసుకున్న నిర్ణయం పట్ల తాము ఏకీభవించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని దేశాలు కూడా మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాల్సిన వేళ.. అమెరికా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందని అనుకోలేదని చెప్పారు. ఈ మేరకు ఆంటోనియో ఓ ప్రకటన విడుల చేశారు.












Click it and Unblock the Notifications