రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి 3 రోజులు బ్రేక్.. పుతిన్ సంచలన నిర్ణయం వెనుక..!
రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పరస్పరం దాడులను కొనసాగిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేసింది. అయితే తాజాగా ఉక్రెయిన్ పై 3 రోజుల పాటు దాడులను నిలిపివేస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు మాస్కో చేరుకున్న వేళ రష్యా- ఉక్రెయిన్ తాత్కాలికంగా దాడులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరి మూడు రోజుల తర్వాత తిరిగి యుద్ధం ప్రారంభ మవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులైన స్టీవ్ వెట్ కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కోకు చేరుకున్నారు.
" ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై ఈ రోజు అర్ధరాత్రి నుంచి మూడు రోజుల పాటు ఎలాంటి దాడులు చేపట్టరాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేశారు" అని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేసినట్లు రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సెప్టెంబర్ 6 ఆదివారం రోజున ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక సెప్టెంబర్ 4న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ.. శాంతి చర్చల నేపథ్యంలో రష్యా దాడులు నిలిపివేయాలని కోరారు. తాము కూడా రష్యాపై దాడులను ఆపేస్తున్నట్లు తెలిపారు. ఇక రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరికొద్ది రోజుల్లో ఐదేళ్లలోకి అడుగు పెట్టనుంది.

గత ఆరు నెలలుగా అమెరికా.. ఇరాన్ తో యుద్ధం చేపట్టిన క్రమంలో ఆ దేశం రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి సారించడంలో విఫలం అయింది. ఈ ఏడాది జనవరిలో వెట్ కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్ నర్ రష్యాలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో క్రెమ్లిన్ లో సమావేశం అయ్యారు. మరి ఈసారి ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో అమెరికా ప్రయత్నాలు ఫలిస్తాయో.. లేదో చూడాలి. ఈ నేపథ్యంలో రాబోయే రెండు రోజుల్లో ఏం జరగబోతోందనేది ఆసక్తిగా మారింది. ఇక ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఒకరు తెలంగాణ వ్యక్తి కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం.












Click it and Unblock the Notifications