రేవంత్ సర్కార్‌పై కవిత సమరభేరి!
రేవంత్ రెడ్డిది చేతకాని.. అసమర్థ ప్రభుత్వమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ చేతకాని ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో ఏటా 4 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఆధునిక కాలంలో ఏటా వేలాది పసికందులు చనిపోతుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ లో పసికందుల మరణాల తర్వాత ఓ మిత్రుడు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు ఎంత ఆధ్వానంగా ఉందో డేటాతో సహా తనకు పంపించారని చెప్పారు. ఆ డేటా చూసిన తర్వాత రెండు రోజుల పాటు నిద్ర పట్టలేదని.. అందులో భయంకరమైన చేదు వాస్తవాలు ఉన్నాయన్నారు. ఆ డేటా వివరాలను మీడియా ముందు ఉంచారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో 2020-21లో 6 వేలు, 2022-23 లో 4,933, 2024-25 లో 3,853 మంది పసిపిల్లలు చనిపోయాని ఆమె వెల్లడించారు. ఏ జిల్లాలో చూసిన సరే ఏటా 2 వందల వరకు పసిపిల్లలు మరణించారని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్తోన్న పాలకులు నగరంలో 1,046 మంది చిన్నారులు చనిపోతే కనీసం మానవత్వం చూపించడం లేదు. ప్రభుత్వానికి పరిపాలన చేతకాకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యానికి పదిశాతం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి కనీసం 5 శాతం కూడా కేటాయించడం లేదన్నారు. కేటాయించిన బడ్జెట్ కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదని చెప్పారు. గతేడాది 13,192 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది 9,242 కోట్లు మాత్రమేనన్నారు. కేటాయించిన బడ్జెట్‌ను కూడా ఖర్చు చేయని ప్రభుత్వాన్ని కాగ్ కడిగి పారేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 11 హెల్త్ స్కీమ్‌లు ఉంటే 7 స్కీమ్ కు ఒక్క పైసా కేటాయించలేదన్నారు. ఆరోగ్యశ్రీ కోసం 7 వందల కోట్లు కేటాయిస్తే 140 కోట్లే ఖర్చు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ స్కీం పెండింగ్ బకాయిలు 5 వందల కోట్లు ఉంటే పైసా విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధ్వానంగా ఆస్పత్రులు.. కలెక్టర్లు ఏం చేస్తున్నారు?
రాష్ట్రంలో ఆస్పత్రులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్ హాస్పిటల్‌లో ఎక్కడ చూసిన చెత్తా చెదారమే కనిపించిందన్నారు. రాష్ట్ర మంత్రి, ప్రతిపక్ష నాయకులు ఇటీవల రిమ్స్‌ను సందర్శించారని, అక్కడే పరిస్థితి ఇలా ఉంటే మిగతా హాస్పిటల్స్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లా కలెక్టర్లు ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్స్, హాస్టల్స్ విజిట్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల బాగోగులు చూసుకోవటం కన్నా కలెక్టర్లకు వేరే పనేముందని నిలదీశారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లను విజిట్ చేస్తే పరిస్థితులు అవే మారుతాయన్నారు. హెల్త్ మినిస్టర్ కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేన్నరేళ్ల తర్వాత పెద్ద ప్రమాదం జరిగితే తప్ప హెల్త్ మినిస్టర్ ఆదిలాబాద్ రిమ్స్ ను విజిట్ చేయలేదన్నారు. ఆదిలాబాద్ కు వచ్చి జిల్లాలో వైద్య పరిస్థితుల గురించి కాకుండా హెలీక్యాప్టర్ ఫ్యూయల్ అయిపోయిందని ఆయన గొడవ పడి వెళ్లిపోయారే తప్ప ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వలేదన్నారు.
ఆదిలాబాద్‌లో రోడ్లు సరిగా లేకపోవడంతోనూ ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీడీఏలో ఉన్న 70 శాతం నిధులను కూడా ఈ ప్రభుత్వానికి వాడుకోవడం చేతకావడం లేదన్నారు. ఆ నిధులను వినియోగించుకొని ఉట్నూర్ ఏజెన్సీలో రోడ్లు వేయించాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు లేవని నీలోఫర్ హాస్పిటల్ లో బెడ్ ఆక్యూపెన్సీ 200 శాతం ఉండటంతో పేషెంట్లకు బెడ్స్ దొరకడం లేదన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి చెబితే గానీ బెడ్ దొరికే పరిస్థితి లేదని, హెల్త్ మినిస్టర్ చెప్పినా సరే నిమ్స్ లో బెడ్ ఇవ్వడం లేదన్నారు. నిమ్స్ లో సర్జరీ కోసం 7 నెలలు వేచి చూడాల్సిన దుస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. ఆడపిల్లల శానిటరీ ప్యాడ్ పడేసేందుకు కూడా స్కూల్స్ లో సదుపాయాలు లేవన్నారు.
విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వంపై యుద్ధం
విద్య, వైద్యం విషయంలో ఫోకస్ పెట్టేలా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నామని కవిత హెచ్చరించారు. తోలు తీసైనా సరే ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సిన అవసరముందన్నారు. విద్య, వైద్యం విషయంలో మార్పు రావాలంటే ప్రజలు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులను ఫొటో తీసి టీఆర్ఎస్ పార్టీకి పంపించాలని కోరారు. ప్రజలు తిరగబడి ప్రశ్నించినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి బాత్‌రూమ్‌ల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలన్నారు. బాత్‌రూమ్‌లోని చోట మనమే చందా వేసుకొని కట్టిద్దామని సూచించారు. వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా ఇక నుంచి అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లను విజిట్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి స్థలాలు తీసుకొని పేదలకు 25 శాతం ఉచిత వైద్యం అందిస్తామని అగ్రిమెంట్ చేసుకున్న కార్పొరేట్ హాస్పిటళ్లు తమ ఆస్పత్రలు పేదవాళ్లను తమ గేటులోపలికి కూడా రానివ్వడం లేదన్నారు. ఆయా హాస్పిటళ్లలో 25 శాతం ఉచిత వైద్యం పేదలకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అఫిడవిట్‌లో కన్నా రూపాయి ఎక్కువ ఉన్న తిరిగి ఇచ్చేస్తా..
తాను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఉన్న దాని కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నట్టు ఎవరు నిరూపించినా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తానని స్పష్టం చేశారు. తన ఫామ్ హౌస్ లీగల్‌గా కట్టుకున్నదని అందులో కబ్జా ల్యాండ్ గానీ, ఎఫ్టీఎల్ జోన్ గానీ, అసైన్డ్ ల్యాండ్ గానీ లేదన్నారు. ప్రతి పైసా తాను చట్టానికి లోబడి సంపాదించుకున్నదేనని.. భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ లకు సంబంధించి వేసిన సిట్ ఉత్తదేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా అనేక రంగాల్లో వేసిన సెట్ లతో ఏం ఒరిగిందని ప్రశ్నించారు. డైవర్షన్ స్కీమ్ లో భాగంగానే ముఖ్యమంత్రి ఇలాంటి సిట్ లు వేస్తారని.. చర్యలు మాత్రం ఉండవని చెప్పారు. ఇంటర్నల్ గా ఒప్పందాలు జరిగే వరకు ఇలాంటి టైమ్ పాస్ సిట్ లు కొనసాగుతూనే ఉంటాయన్నారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు కల్వకుంట్ల కవిత. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. మరో పార్టీ నుంచి గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా సీటు ఇచ్చి పోటీ చేయించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమన్నారు. అలాంటి పార్టీకి మద్దతిస్తే రాజ్యాంగం, చట్టాలు ఏమీ వద్దని మనమే చెప్పినట్లవుతుందని ప్రజలకు సూచించారు. ఎస్ఐఆర్ విషయంలో చాలా గందరగోళం నెలకొందని.. రీ ఎడిట్ ఆప్షన్ లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చిన్న క్లరికల్ మిస్టేక్స్ ఉన్నా ఓట్లు తొలగించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కును లాక్కోవటమేనన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్న సభ ద్వారా ప్రజలకు జరిగే మంచి ఏమీ ఉండదన్నారు. ఆ సభలోనైనా నెరేళ్ల బాధితులకు న్యాయం చేసే అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో ఇప్పటి వరకు ఎస్సీ కమిషన్ నివేదిక ఇవ్వలేదని, పోలీసులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. రాజకీయాలు మాని ప్రజలకు మంచి జరిగేందుకు సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రికి సూచించారు.
చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె చూపించిన స్ఫూర్తితో బహుజన తెలంగాణ సాధన కోసం ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి, మాధవి, శ్రీకాంత్ రావు, అర్చనా సేనాపతి, రాంకోటి, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.














Click it and Unblock the Notifications
