మరో యుద్ధాన్ని నిలిపిన క్రెడిట్ కొట్టేసిన ట్రంప్: పుతిన్ కు 2 గంటల ఫోన్ కాల్: శాంతి చర్చలకు సై
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.
ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.
రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తలవంచట్లేదు ఉక్రెయిన్. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఈ ఇద్దరు అధినేతల మధ్య దాదాపుగా రెండున్నర గంటల పాటు సాగింది టెలిఫోన్ సంభాషణ. ఉక్రెయిన్ తో సీజ్ ఫైర్ అంశంపైనే మాటలు సాగాయి.
ఉక్రెయిన్ తో రష్యా సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగిస్తోండటం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారని వైట్ హౌస్ తెలిపింది. వారానికి సగటున 5,000 కంటే ఎక్కువ మంది రష్యన్, ఉక్రేనియన్ సైనికులు మరణిస్తోన్నారని ట్రంప్ ప్రస్తావించారని వివరించింది. ఈ యుద్ధాన్ని ఆపడం కోసమే పుతిన్ తో మాట్లాడారని పేర్కొంది.
ఈ టెలిఫోన్ చర్చల సారాంశాన్ని డొనాల్ట్ ట్రంప్ వెల్లడించారు. తక్షణమే శాంతి చర్చలను చేపట్టడానికి రష్యా- ఉక్రెయిన్ అంగీకరించినట్లు వెల్లడించారు. యుద్ధం ముగిసింది..(End to the War) అని ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ట్రూత్ పై ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. యుద్ధాన్ని నిలిపివేసి, ముఖాముఖి చర్చలకు ఈ రెండు దేశాల అధినేతలు అంగీకరించారని చెప్పారు.
ఈ టెలిఫోన్ కన్వర్జేషన్ తరువాత పుతిన్ కూడా మాట్లాడారు. సోచి నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. ట్రంప్ తో జరిగిన చర్చల సారాంశాన్ని ప్రస్తావించారు. యుద్ధాన్ని నిలిపివేయడానికి ట్రంప్ చొరవ తీసుకున్నారని, ఆయనకు ధన్యవాదాలను తెలియజేస్తోన్నానని అన్నారు.
యుద్ధ విరమణపై అమెరికా అధ్యక్షుడు తన వైఖరిని స్పష్టంగా తెలియజేశారని, తాను కూడా ఉక్రెయిన్ తో తలెత్తిన సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇష్టపడుతున్నానని అన్నారు. శాంతియుత వాతావరణం నెలకొనడానికి, సీజ్ ఫైర్ ప్రకటించడానికి అవసరమైన మార్గాలను తామే నిర్ణయించాల్సి ఉందని చెప్పారు.
డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనలు, సూచనలతో తాను ఏకీభవించానని, భవిష్యత్తులో కుదుర్చుకోదలిచిన శాంతి ఒప్పందంపై ఓ మెమోరాండం రూపొందించే దిశగా ఉక్రెయిన్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పుతిన్ తెలిపారు. సీజ్ ఫైర్ ఒప్పందం, దానికి కావాల్సిన నిబంధనలు, ఇతరత్రా అంశాలను ఖరారు చేయాల్సి ఉందని అన్నారు.
అందులో పొందుపరిచే షరతులకు అంగీకారం కుదిరితే నిర్దుష్ట కాలానికి పరిమితం అయ్యేలా కాల్పుల విరమణ సాధ్యపడుతుందని పుతిన్ తేల్చి చెప్పారు. ట్రంప్ తో జరిగిన సంభాషణలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, వాటిపై చాలా స్పష్టంగా ఉన్నామని పేర్కొన్నారు పుతిన్.
2022లో యుద్ధం ఆరంభానికి ముందు ఉక్రెయిన్ వల్ల శాంతి చర్చల్లో అంతరాయం ఏర్పడిందని, వాటిని పునఃప్రారంభించడానికి అభ్యంతరం లేదని పుతిన్ అన్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ముఖాముఖి చర్చలు పునః ప్రారంభించడానికి సహకరించినందుకు ట్రంప్ కు కృతజ్ఞత చెప్పారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం వల్ల యుద్ధాన్ని నిలిపివేసే దిశగా రెండు దేశాలు కూడా అడుగులు వేసినట్టవుతుందని, అప్పుడే చర్చలు ఫలిస్తాయని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభానికి మూల కారణాన్ని నిర్మూలించడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications