రష్యా కాల్పుల విరమణ : సుమీలో చిక్కుకున్న భారతీయులు.. తరలింపునకు కేంద్రం చర్యలు !
ఉక్రెయిన్‌పై గత 13 రోజులుగా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఒక వైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రపంచ దేశాలు రష్యా-ఉక్రెయిన్‌లను కోరాయి. అటు ఉక్రెయిన్‌లోని సుమీలో భారతీయులు చిక్కుకున్నారు. వారి భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వారి తరలింపుపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోదీ మాట్లాడారు. మానవత కారిడార్ లను ఏర్పాటు చేయాలని కోరారు.

ఐదు నగరాల్లో కాల్పుల విరమణ
ఈ నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. కీవ్ , సుమీ, చెర్నిహివ్, ఖార్కివ్, మారిపోల్ నగరాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ నగరాల నుంచి పౌరులను తరలించేందుకు మానవతా కారిడాలను తెరుస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా తెలిపారు. తరలింపు ప్రక్రియ కూడా మొదలైందని చెప్పింది..

సుమీ నుంచి భారతీయుల తరలింపు
సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ తెలిపారు. తొలుత వారిని బస్సులో పోల్తావాకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సుమీలో 694 మంది భారతీయులు ఉన్నారని పేర్కొన్నారు. వారందరూ పోల్తావాకు బయలుదేరారని వెల్లడించారు. అటు మైకోలెయివ్ పోర్టులో 75 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారని స్థానిక భారత రాయభార కార్యాలయం వెల్లడించింది. వారిని తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. బస్సులో 57 మంది భారతీయ నావికులను తరలించగా.. ఇంకా 23 మంది ఉన్నారు. వారిని కూడా తరలించేందుకు చర్చలు చేపట్టినట్లు తెలిపింది.

20 లక్షల మంది వలసలు
ఉక్రెయిన్‌పై దాడులు చేపట్టినప్పటి నుంచి ఆదేశ పౌరులు లక్షలాది మంది పొరుగు దేశాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 లక్షలకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ యూఎన్‌హెచ్‌సీఆర్ వెల్లడించింది. ఈ యుద్ధ వాతావరణానికి తక్షణమే ఇరుదేశాలు ముగింపు పలకాలని కోరింది. లేకపోతే రాబోయే రోజుల్లో లక్షలాది మంది ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అటు ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పౌరులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా పరిస్థితులు కల్పించాలని కోరింది.












Click it and Unblock the Notifications