కూలిన రష్యా ప్లేన్: ఐసిస్‌కి అంత సీన్ లేదు! కారణం..
కైరో: ఈజిప్ట్‌లోని సినాయి ద్వీపకల్పంలో కూలిపోయిన రష్యా విమానాన్ని తామే కూల్చామని ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్స్) తీవ్రవాద సంస్థ చేసిన ప్రకటన పైన ఈజిప్ట్, రష్యాలు స్పందించాయి. ఐసిస్ ప్రకటనను రష్యా ఖండించింది.
ఈజిప్ట్ రవాణా శాఖ మంత్రి మాక్సిమ్ సోకోలోవ్ మాట్లాడుతూ... వారి మాటలు నమ్మదగ్గవి కాదన్నారు.
రష్యా కు చెందిన కొగల్మావియా ఎయిర్ లైన్స్ విమానాన్ని తామే కూల్చేశామంటూ ఐసిస్ చేసిన ప్రకటనను ఈజిప్టు అధికారులు కూడా ఖండించారు. ఐఎస్ఐఎస్‌కు అంత సీన్ లేదని అభిప్రాయపడ్డారు. ఐఎస్ఐఎస్‌కు విమానాన్ని కూల్చేసే పరిజ్ఞానం లేదని ఈజిప్టు అధికారులు స్పష్టం చేశారు.
భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణులకు కేవలం 32 వేల అడుగుల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం మాత్రమే ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఐసిస్ ప్రకటన అవాస్తవమన్నారు. రష్యన్ విమానం సాంకేతిక కారణంతోనే కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు.

అయితే, దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విమానం బయల్దేరిన కాసేపటికే సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ గాజాలోని ఎల్ ఎరిష్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు. సాంకేతిక సమస్య తలెత్తాక విమానం నిమిషానికి 1500 మీటర్ల ఎత్తున కిందికి పడిపోయిందని అధికారులు పేర్కొన్నారు.
ల్యాండ్ చేసే ప్రయత్నంలో విమానం కూలిపోయినట్టు కైరో అధికారులు తెలిపారని రష్యా పేర్కొంది. విమానంలో పని చేస్తున్న ఏడుగురు సిబ్బంది, 217 మంది ప్రయాణికులు అంతా రష్యన్లేనని ఈజిప్టు అధికారులు వెల్లడించారు. విమానం బ్లాక్ బాక్స్‌ను అధికారులు గుర్తించారు. దీంతో విమానం కూలిపోవడానికి కారణాలు తెలిసినట్టేనని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications