అమెరికన్ డాలర్‌కు బదులుగా చైనా యువాన్ వినియోగం: రష్యా సంచలన ప్రకటన
కరెన్సీ వినియోగంపై రష్యా సంచలన ప్రకటన చేసింది. తమ వాణిజ్య కార్యకలాపాల్లో ఇకపై అమెరికన్ డాలర్ కు బదులుగా చైనా యువాన్ ను వినియోగించనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
మాస్కో: చైనా (China) అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ (Xi Jinping).. రష్యా (Russia)లో పర్యటిస్తోన్నారు. ఇవ్వాళ ఆయన పర్యటన ముగియనుంది. చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికైన తరువాత జిన్ పింగ్ (Xi Jinping) తొలిసారిగా రష్యాలో పర్యటిస్తోన్నారు. ఉక్రెయిన్ (Ukraine)తో సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో- ఆయన రష్యాలో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తొలి రోజే..
తొలి రోజే ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ పీస్ ప్లాన్ (Ukraine Peace plan) ప్రతిపాదనలను తెరమీదికి తీసుకొచ్చారు. దీనిపై ఎలాంటి చర్చా జరగలేదని తెలుస్తోంది. ఉక్రెయిన్ పై తన వైఖరిని మార్చుకోవడానికి పుతిన్ (Putin) పెద్దగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. ఇదే విషయంపై కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి.

డాలర్ కు బదులుగా..
కాగా- జిన్‌పింగ్ (Jinping) పర్యటన సందర్భంగా పుతిన్ (Putin) సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాము అమెరికన్ డాలర్ (US Dollar) కు బదులుగా చైనా యువాన్ (China Yuan) ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మూడోవంతు వ్యాపార కార్యకలాపాలన్నింట్లోనూ రష్యన్ రూబుల్, చైనా యువాన్ ను వినియోగిస్తోన్నామని, ఇక పూర్తి స్థాయిలో యువాన్ ను ప్రవేశపెట్టబోతోన్నామని చెప్పారు.
ఆసియా సహా..
ఆసియా (Asia), ఆఫ్రికా (Africa), లాటిన్ అమెరికా (Latin America) దేశాలతో నిర్వహించే వాణిజ్య కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఎగుమతులు-దిగుమతుల్లో ఇకపై చైనా యువాన్ ను ప్రవేశపెడతామని పేర్కొన్నారు పుతిన్. జిన్ పింగ్ సహా చైనా ఆర్థిక, విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో రాజధాని మాస్కోలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో పుతిన్ ఈ ప్రకటన చేశారు. జిన్ పింగ్ రష్యా దేశ పర్యటనకు రావడం.. ఆయన తమకు ఇస్తోన్న ప్రాధాన్యతను తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపైనా..
చైనా ప్రతిపాదించిన ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక (Ukraine Peace Plan) లోని అనేక నిబంధనలు యుద్ధాన్ని నివారించడానికి అనుకూలంగా ఉన్నాయని తాను నమ్ముతున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఈ శాంతి ప్రణాళికపై చర్చించడానికి పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్ ముందుకు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. శాంతియుత పరిష్కారానికి దీన్ని ఓ ప్రధాన ప్రాతిపదికగా తీసుకోవచ్చని పుతిన్ స్పష్టం చేశారు.

అండగా నిలిచిన చైనా..
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన నేపథ్యంలో అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ యూనియన్ (EU), నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) సభ్య దేశాలన్నీ ఎదురు తిరిగిన వేళ- రష్యాకు చైనా అండగా నిలిచిన విషయం తెలిసిందే. తన మిత్ర దేశానికి ఆర్థికపరమైనే అనేక వెసలుబాట్లను కల్పించింది చైనా.












Click it and Unblock the Notifications