రష్యా శాంతి మంత్రం: ఫైనల్ డెడ్‌లైన్: అదే వేదికపై చర్చలకు ఉక్రెయిన్ ఓకే
మిన్స్క్: ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్న రష్యా.. ఒక్కసారిగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. యుద్ధం నాలుగో రోజుకు చేరుకున్న వేళ.. శాంతి మంత్రాన్ని జపించడం ఆరంభించింది. ఒకవంక రష్యాపై తన దాడులను ఉధృతం చేస్తూనే- మరోవంక చర్చలకు సిద్ధమని ప్రకటించింది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో.. చర్చల ప్రతిపాదనలకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. తన ప్రతినిధుల బృందాన్ని పంపించింది.

చర్చలకు అంగీకరించిన జెలెన్‌స్కీ..
అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని.. రష్యా సైన్యం కీవ్‌లో దూసుకెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నాయి. వారిని ఉక్రెయిన్ ఆర్మీ.. ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌ను సొంతం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను విఫలం చేస్తోంది. ఈ రెండు దేశాల సైన్యం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో రష్యా ప్రభుత్వం తెర మీదికి తీసుకొచ్చిన చర్చల ప్రతిపాదనలను అంగీకరించడం మినహా ఉక్రెయిన్‌కు మరో మార్గం కనిపించనట్టే.

ప్రత్యామ్నాయ వేదికలను సూచించినా..
తొలుత- బెలారస్ రాజధాని మిన్స్క్‌లో చర్చల్లో పాల్గొనడానికి రావాల్సిందిగా రష్యా సందేశాన్ని పంపించింది. దీన్ని తిరస్కరించింది ఉక్రెయిన్. ప్రత్యామ్నాయ వేదికలను సూచించింది. వార్సా, బ్రేటిస్లేవియా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్ లేదా బాకుల్లో చర్చలకు తాము సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఈ వేదికల్లో చర్చల్లో పాల్గొనడానికి రష్యా సుముఖతను వ్యక్తం చేయలేదు. నాలుగో రోజు తన యుద్ధాన్ని తీవ్రతరం చేసింది.

ఖార్కీవ్ స్వాధీనం..
వ్యూహాత్మకంగా కీవ్‌ను చుట్టుముట్టింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ నగరాన్ని సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ సైనికులతో స్ట్రీట్‌ఫైట్‌కు దిగాయి రష్యన్ సైనిక బలగాలు. క్రమంగా కీవ్‌ను ఆక్రమించుకోవడానికి సన్నద్ధం అయ్యాయి. ఈ పరిస్థితులతో చర్చలకు సిద్ధమంటూ వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. బెలారస్‌లో రష్యా ప్రతినిధి బృందంతో చర్చలను నిర్వహించడానికి సిద్ధమంటూ తన అంగీకారాన్ని తెలిపారు. అప్పటికప్పుడు తన ప్రతినిధుల బృందాన్ని బెలారస్‌కు పంపించారు.

బెలారస్‌లో ఓకే..
తొలుత నిరాకరించిన బెలారస్‌లోనే ముఖాముఖి సమావేశానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని మిన్స్క్‌లో కాకుండా మరో నగరాన్ని ప్రతిపాదించారు జెలెన్‌స్కీ. బెలారస్‌లోని గోమెల్‌లో సమావేశం కావాలని సూచించారు. దీనికి రష్యా కూడా అంగీకరించింది. ఫలితంగా- రెండు దేశాల ప్రతినిధుల బృందం బెలారస్‌కు బయలుదేరి వెళ్లాయి. ఇంకొన్ని గంటల్లో గోమెల్ వేదికగా ఈ రెండు దేశాల మధ్య చర్చలు ఆరంభం కానున్నాయి. అవి ఫలప్రదం అయితేనే యుద్ధం ముగిసినట్టవుతుంది.

యుద్ధం యుద్ధమే..
మరోవంక- చర్చల ప్రతిపాదనలను అంగీకరించిన ఈ రెండు దేశాలు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. చర్చలు చర్చలే.. యుద్ధం యుద్ధమే అన్నట్లు వ్యవహరిస్తోన్నాయి. రష్యా సైనికులు తమ దాడులను తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. గంటగంటకూ ఈ తీవ్రత పెరుగుతూనే వస్తోంది. రష్యా సైనిక బలగాల దూకుడును అడ్డుకోవడానికి అటు ఉక్రెయిన్ తన సర్వశక్తులను ఒడ్డుతోంది. రష్యా సైన్యంతో స్ట్రీట్ ఫైట్‌కు దిగడానికీ వెనుకాడట్లేదు. నాలుగో రోజు యుద్ధం తీవ్రత మరింత ముదిరింది. దాడులు ప్రతిదాడులతో ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు అట్టుడికిపోతున్నాయి.












Click it and Unblock the Notifications